AP Fishermen Released By PAK: 14 నెలల తరువాత స్వదేశానికి, పాక్ చెర నుండి బయటకు వచ్చిన ఆంధ్రా జాలర్లు, ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు, సరిగ్గా తిండి కూడా పెట్టలేదంటూ ఆవేదన
వీరంతా గుజరాత్ (Gujarat)తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్ (Pakistan) ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ సైన్యానికి బందీగా చిక్కారు.
Amaravathi, January 07: గత 14 నెలలుగా పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న 20 మంది ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వీరంతా గుజరాత్ (Gujarat)తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్ (Pakistan) ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ సైన్యానికి బందీగా చిక్కారు.
ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలకు(AP Assembly Elections 2019) ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ప్రజా సంకల్ప యాత్రతో (Praja sankalpa yatra) పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సంగతి విదితమే. ఆ సమయంలో వైఎస్ జగన్ దృష్టికి మత్స్యకార కుటుంబాలు తమ సమస్యను తీసుకు వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆ పనిని వైఎస్సార్‌సీపీ ఎంపీల (YSCRP MP's) బృందానికి అప్పగించారు.
ఇందులో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి( MP vijaya Sai Reddy) నేతృత్వంలోని ఎంపీల బృందం విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపింది. భారత్ విఙ్ఞప్తి మేరకు మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ అంగీకరించింది. మత్స్యకారులు తాము బందీలుగా ఉన్న మాలిర్ జిల్లా జైలు నుంచి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. వారిని పాకిస్తాన్ అధికారులు కరాచీ నుంచి లాహోర్ వరకు రైలులో తీసుకొచ్చారు. అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతాదళానికి అప్పగించారు.
Here's Video
జాలర్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు (MInister Mopidevi Venkata Ramana) రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి స్వాగతం పలికి స్వీట్లు తినిపించారు. ఢిల్లీ నుంచి 12 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా మత్స్యకారులు నేడు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిన అనంతరం మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమక్షంలో వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు.సంక్రాంతి నేపథ్యంలో తమవారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటుండటంతో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన మత్స్యకారులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు ఓ న్యూస్ ఛానల్ కు తెలిపారు. మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించాం. దాంతో వారు మమ్మల్ని పట్టుకుని.. కరాచీలోని లాండీ జైల్లో ఉంచారు. మాతో అనేక పనులు చేయించుకున్నారు.
సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మమ్మల్ని విడిపించేందుకు ప్రయత్నించారని తెలిసింది. తల్లి మాకు జన్మనిస్తే వైఎస్ జగన్ పునర్జన్మనిచ్చారు. మాకు సరైన ఉపాధి లేకనే చేపల వేటకు గుజరాత్ వెళ్లాం. మా ఉపాధికి అవసరమైన జెట్టీలను ప్రభుత్వం అందజేయాలని కోరుతున్నాం. 14 నెలల తర్వాత మా కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’అని అన్నారు.
మత్స్యకారులకు అండగా ఉంటాం: మంత్రి మోపిదేవి
ప్రజాసంకల్ప యాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హమీని నెరవేర్చారని ఇది వారికి పునర్జన్మ అని, ఇప్పటికైనా విడుదల కావడం సంతోషకరమని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. మత్స్యకారులంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉన్నామని చెప్పారన్నారు. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మరో ఇద్దరు మత్స్యకారులు డాక్యుమెంట్లు, తదితర సాంకేతిక కారణాలతో విడుదల కాలేదని, వారిని కూడా విడుదల చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లో భారత మత్స్యకారులు మరో 237 మంది వరకు ఉన్నారని అక్కడి అధికార వర్గాలు తెలిపినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
పాకిస్తాన్ విడుదల చేసిన ఆంధ్రా జాలర్ల జాబితా ఇదే..
1. ఎస్.కిశోర్ , తండ్రి అప్పారావు
2. నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న
3. గరమత్తి, తండ్రి రాముడు
4. ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు
5. ఎస్. అప్పారావు, తండ్రి రాములు
6. జి. రామారావు, తండ్రి అప్పన్న
7.బాడి అప్పన్న, తండ్రి అప్పారావు
8. ఎం. గురువులు, తండ్రి సతియా
9. నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య
10. నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్
11. వి. శామ్యూల్, తండ్రి కన్నాలు
12. కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు
13. డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి
14. కందా మణి, తండ్రి అప్పారావు
15.కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు
16.శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు
17.కేశం రాజు, తండ్రి అమ్మోరు
18.భైరవుడు, తండ్రి కొర్లయ్య
19.సన్యాసిరావు, తండ్రి మీసేను
20. సుమంత్ తండ్రి ప్రదీప్