Vizag Road Accident: నాన్నా నన్ను బయటకు తీయండి..బస్సు చక్రాల కింద పడి యువతి కన్నీటి రోదన, విశాఖ ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ వద్ద ఘో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి, తండ్రికి గాయాలు, న్యాయం చేయాలని రోడ్డెక్కిన బంధువులు
బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుమార్తెను మృత్యువు ( Visakhapatnam, Road Accident) రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఆదివారం ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
Visakhapatnam, Mar 29: విశాఖ పట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుమార్తెను మృత్యువు ( Visakhapatnam, Road Accident) రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఆదివారం ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసుల కథనం ప్రకారం.. గాజువాక భవానీనగర్‌కు చెందిన సమ్మిడి గీతాకుమారి (21) బీఈడీలో (Bachelor of Education (BEd) చేరేందుకు తండ్రి వెంకటరావుతో ద్విచక్రవాహనంపై ఎంవీపీ కాలనీకి బయలుదేరింది.
ఎన్‌ఏడీ జంక్షన్ (NAD Junction) సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత వెనుకనుంచి వస్తున్న ప్రైవేటు బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పింది. వెనుక కూర్చున్న గీతా కుమారి కుడివైపుగా బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. ఆమె నడుమ మీదుగా బస్సు వెళ్లిపోవడమే కాకుండా కొంతదూరం ఈడ్చుకుపోయింది. కడుపు భాగమంతా తీవ్ర గాయాలయ్యాయి.
ట్రాఫిక్ పోలీసులు ప్రైవేటు వాహనంలో కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కేజీహెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపు భాగంలో అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. వెంకటరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఆ సమయంలో తనకు ఏం జరిగిందో తెలియని గీతాకుమారి.‘‘నాన్నా రండి... నన్ను బయటకు తీయండి నాన్నా'' అంటూ విలపించింది. ఆమె ఆర్తానాదాలు అక్కడున్నవారి హృదయాలను కలచివేశాయి.ఈ ప్రమాదం జరగగానే స్థానికులు ఎన్ఎడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమై ట్రావెల్ బస్సు డ్రైవర్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చి చెప్పారు.
ట్రావెల్స్ యజమాని ఇంతవరకు బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయపరమైన చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు బస్సులను విడిచి పెట్టబోమని రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బస్సులను సర్వీసు రోడ్డులోకి మళ్లించారు. కార్పొరేటర్‌లు మూర్తి, గుడివాడ అనూష, వైసీపీ నాయకుడు గుడివాడ లతీశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.