AP Panchayat Polls 2021: ఏపీలో తెగని పంచాయితీ లొల్లి, తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పిన ఏపీ సర్కారు
ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ (AP Panchayat Polls 2021) శనివారం ఉదయం విడుదలైంది.
Amaravati, Jan 23: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారింది. ఏపీలో తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ (AP Panchayat Polls 2021) శనివారం ఉదయం విడుదలైంది. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తామని తెలిపారు.
కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు (AP panchayat elections 2021) నిర్వహించనున్నట్లు తెలిపారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని... సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని నిమ్మగడ్డ (Nimmagadda Ramesh Kumar) కోరారు.
సీఎస్, డీజీపీ, పీఆర్ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశానికి హాజరు కాలేదు. సాంకేతిక కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణలో సీఎస్ (Andhra Pradesh State Election Commissioner) తమ వ్యతిరేకతను తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేవరకు తాము ఎన్నికల నిర్వహణకు సహకరించబోమన్న సంకేతాలను నేరుగా ఇచ్చారు. ఇప్పటివరకు డీజీపీ ఎన్నికలపై స్పందించలేదు.
ఇదిలా ఉంటే ఎన్నికలను వాయిదా వేయాలని సీఎస్, నిమ్మగడ్డకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని ఎస్‌ఈసీ తిరస్కరించారు. మరోవైపు ఎన్నికలను బహిష్కరిస్తాం..అవసరమైతే సమ్మెకు సిద్ధమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. కరోనా టీకాలు వేశాకే ఎన్నికల విధుల్లోకి వెళ్తామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రాణాలు పొగొట్టుకోవాల్సిన అవసరం లేదని, తమ ప్రాణాల తర్వాతే ఉద్యోగమని పేర్కొన్నారు. తమ శవాల మీద నడుచుకుంటూ వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అధికారం తప్ప.. బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎస్‌ఈసీకీ అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని.. అధికారాన్ని, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని ప్రధాని చెప్పారు. ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని.. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదు.. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రెస్ మీట్ కేవలం పొలిటికల్ సమావేశంలా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు.. 2021లో జరగడానికి కారకులు ఎవరని ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇటువంటి తరుణంలో ఎన్నికల నిర్వహిస్తే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పొతే ఎవరు బాధ్యత తీసుకుంటారు. మీరు ఫాల్స్ ప్రెస్టేజ్‌కు పోతున్నారు. మీరు కుర్చీలో ఉండగా ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా.. ఎందుకంత నియంతృత్వ పోకడ’’ అంటూ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి : స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు, ప్రజల ప్రాణానికో న్యాయం.. మీ ప్రాణానికి మరొక న్యాయమా?. ఉద్యోగులంతా ఫ్రంట్‌లైన్ వారియర్స్ అని తెలియదా?. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పింది. కేంద్రం రూల్స్ అంటే నిమ్మగడ్డకు లెక్కలేదా?. దీనిపై వివరణ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారంటూ’’ బాలశౌరి విమర్శలు గుప్పించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాక్సినేషన్ పూర్తి కాకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రబుత్వ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి వెల్లంపల్లి: మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని, ఆలయాలపై దాడుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఏడాదిలోగా రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నారు. హిందువుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. ప్రజలు, అధికారుల ప్రయోజనాలను నిమ్మగడ్డ పక్కన పెట్టారని, చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా: వ్యాక్సిన్ పూర్తయ్యే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. నిమ్మగడ్డ కేవలం చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని, రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్షాలు నీచంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
మంత్రి శంకర్‌నారాయణ : ప్రభుత్వ సూచనలు, ఉద్యోగుల అభ్యర్థనలు తోసిపుచ్చి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం నిరంకుశత్వానికి అద్దం పడుతోందని, వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.
కాగా 2018 ఆగస్టులోనే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల కాల పరిమితి ముగిసింది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్న నిమ్మగడ్డ.. అప్పట్లో ఎన్నికలు నిర్వహించకుండా మూడేళ్లుగా కాలయాపన చేశారు. 2019లో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయ్యింది. గతేడాది మార్చిలో స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీని ప్రభుత్వం కోరినా.. ఓటర్ల జాబితా తయారు కాలేదంటూ ఎస్‌ఈసీ అప్పట్లో మెలిక పెట్టింది.
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు: కరోనా సాకుతో కేవలం ఆరు కేసులు నమోదైన సమయంలో ఎస్‌ఈసీ గతేడాది ఆకస్మికంగా జడ్పీ ఎన్నికలు వాయిదా వేసింది. మూడేళ్లగా ఎన్నికలు నిర్వహించకుండా తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఉద్యోగ సంఘాల అభ్యర్ధనలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్టించుకోకుండా.. ఎస్‌ఈసీ ఏకపక్షంగా ముందుకెళ్తోంది అంటూ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్ ప్రెస్‌మీట్‌లా అనిపించింది. 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఎన్నికల నిర్వహణలో మూడేళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైంది?.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయింది?.ఎన్నికల నిర్వహణ ఒక విధి అనే భావన ఎక్కడా కనిపించట్లేదు. అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని’’ అంబటి దుయ్యబట్టారు
ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ : నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంపై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. 'సంఘాలుగా ఏర్పడింది నిమ్మగడ్డకు భజన చేసేందుకు కాదు.. ఉద్యోగుల హక్కుల కాపాడేందుకే ఏర్పడ్డాయి. ప్రభుత్వం చెబుతున్న వాదనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదో అర్థం కావడం లేదు. భయభ్రాంతులకు గురిచేసి ఉద్యోగులతో పనిచేయించలేరు. నిమ్మగడ్డ హెచ్చరికలకు ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు.. ఉద్యోగులకు అండగా మేముంటాం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతోనే నిమ్మగడ్డ ఉన్నారు. రాజ్యాంగం నిమ్మగడ్డ ఒక్కరికే కాదు.. ప్రతి పౌరుడికీ రాజ్యాంగ హక్కు ఉంది. ఉద్యోగుల పట్ల బెదిరింపు ధోరణి కుదరదు.. బెదిరించే తత్వాన్ని తాము ఎంత మాత్రం అంగీకరించం 'అని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ శభపరిణామమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. సీఎం జగన్ పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటున్నారని తప్పుబట్టారు. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సీఎం, ఉద్యోగులు ఎన్నికలకు సహకరించాల్సిందేనని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సుప్రీం జోక్యం చేసుకోదని తెలిపారు. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి ఆశాభంగం తప్పదన్నారు. ఎస్ఈసీ పదవీ కాలాన్ని మరో 3నెలలు పొడిగించాలని, రాష్ట్రపతి, గవర్నర్‌కు లేఖ రాస్తానని హర్షకుమార్ ప్రకటించారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు: స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతో తమ తోలుబొమ్మ కనకరాజన్‌ను తెచ్చారని విమర్శించారు. ప్రజాబలం వైసీపీకి ఉంటే ఎస్‌ఈసీతో ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ఎన్నికల కమీషనర్‌కు ఉద్యోగులు సహకరించరని పెద్దిరెడ్డి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు: ఎన్నికల విషయంలో కోర్టు తీర్పు జగన్‌కు చెంపపెట్టు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోందన్నారు. ఓటమి భయంతో వాయిదా కోరుతోందని వ్యాఖ్యానించారు. ఈసీకి ఒక కులం పేరు పెట్టి అవమానించడం మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. చట్టంపై టీడీపీకి నమ్మకం ఉందని తెలిపారు. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో గెలిచి టీడీపీ సత్తా చాటుతామని ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.