Andhra Pradesh: క్లాస్ రూంలో మైనర్ల పెళ్లి వీడియో వైరల్, ఘటనను సుమోటోగా స్వీకరించిన ఏపీ పోలీస్ శాఖ, మహిళా శాఖ అధికారులకు తెలియజేసిన రాజమండ్రి పోలీసులు

ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వయంగా దీని గురించి తెలుసుకుని మహిళా మరియు పిల్లల అభివృద్ధి శాఖకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

Representational Image (Photo Credits: Unsplash.com)

Amaravati, Dec 6: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండు రోజుల క్రితం జరిగిన పెళ్లి కలకలం సృష్టించిన సంగతి విదితమే. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‎లోనే మైనర్లు పెళ్లి చేసుకున్నారు . క్లాస్ రూమ్ లోనే ఓ అబ్బాయి తన లవర్ అయిన అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు (Andhra minors marry in college classroom) పెట్టాడు. ఈ ఘటన నవంబర్ లో జరిగిందని వీడియోను బట్టి తెలుస్తుండగా తాజాగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీస్ శాఖ దీనిని సుమోటోగా (Andhra Police Takes Suo Moto Cognizance) స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వయంగా దీని గురించి తెలుసుకుని మహిళా మరియు పిల్లల అభివృద్ధి శాఖకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. "వీడియో మా దృష్టికి వచ్చింది, కాని దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. దంపతుల తల్లిదండ్రులు లేదా పాఠశాల యాజమాన్యం దీనిని నివేదించలేదు. కాని మేము ఈ విషయాన్ని సుమోటో కాగ్నిజెన్స్ తీసుకొని మహిళా శాఖ అధికారులకు (Women and Children Development) తెలియజేసాము. వారు పిల్లల భవిష్యత్ ని పరిశీలనలోకి తీసుకుని ఈ విషయాన్ని పరిశీలిస్తారు "అని రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు తెలిపారు.

వీడియో వెలువడిన తరువాత, కళాశాల యామాన్యం ఇద్దరికీ బదిలీ సర్టిఫికెట్లు (టిసి) ఇచ్చి పంపారు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.విద్యార్థులు చేసిన పనితో వారి తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పిచ్చి పనులేంటంటూ ఆవేదన చెందుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని ఎగతాలి చేస్తూ ఇలా బొమ్మల పెళ్లిళ్లు చేసుకోవడమేంటంటూ మండిపడుతున్నారు.