AP Assembly Session 2021: సినిమాటోగ్రఫీ బిల్లు, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, ఇకపై సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్న ఏపీ ప్రభుత్వం

సినిమాటోగ్రఫీ బిల్లు 2021, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు 2021లకు (Vehicle Tax Law Amendment Bill) ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో (AP Assembly Session 2021) చట్టం చేసింది.

MInister Perni Nani (Photo-Video Grab)

Amaravati, Nov 24: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. సినిమాటోగ్రఫీ బిల్లు 2021, వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు 2021లకు (Vehicle Tax Law Amendment Bill) ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేస్తూ అసెంబ్లీలో (AP Assembly Session 2021) చట్టం చేసింది. ఏపీ సినిమాస్‌ క్రమబద్ధీకరణ సవరణ బిల్లును (Cinematograph (Amendment) Bill, 2021) మంత్రి పేర్నినాని బుధవారం సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణ ప్రకారం ప్రభుత్వ సంస్థ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే టికెట్‌ కొనాలి. థియేటర్స్‌లో ఇకనుంచి టికెటింగ్‌కు అనుమతి లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ తరఫున బిల్లును మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.

ఇకపై సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేలా నిబంధన విధించారు. బెనిఫిట్‌ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేయనున్నారు. కొత్త వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ను పాత వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌లను పెంచుతూ సవరించారు. కొత్త వాహనాలకు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు లైఫ్‌ ట్యాక్స్‌ పెంచారు. దీంతో ప్రజలపై రూ.409 కోట్ల అదనపు భారం పడనుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు రూ.4వేల నుంచి రూ.6 వేల వరకు గ్రీన్‌ టాక్స్‌ విధిస్తున్నట్లు చెప్పారు.

ఎంపీ కేశినేని నాని ఓటుతో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ, ఛైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నిక

ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సినిమా చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా అనగానే తమకి ఎదురుండకూడదన్న ధోరణిలో కొందరు ఉన్నారని, పేద, మధ్యతరగతి వాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారని అన్నారు. కొందరు ఇష్టానుసారం ధరలను పెంచుకుంటున్నారని, అందుకే ఆన్‌లైన్ విధానంలో టికెట్ ఇచ్చే పద్ధతి తేవాలనుకున్నామని వివరించారు. దాంతో పాటు సినిమా షోలను కూడా అదుపు చెయ్యాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

సినిమా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలని తెలిపారు.సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్సులకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శకంగా, ప్రజలకు మంచి అందుబాటులో ఉండే ధరకి టికెట్లను తీసుకొస్తామని తెలిపారు. దీనిపై కొన్ని పార్టీలు, పేపర్లు, టీవీలు బురద వెయ్యడం దుర్మార్గమని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరు తమ విధానాలను స్వాగతించారని పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. థియేటర్లతో పాటు ఆన్‌లైన్‌లో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సినిమా వినోదం అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజల ఉత్సాహాన్ని సోమ్ము చేసుకునేలా ఉండకూడదని తెలిపారు. ప్రొడ్యూసర్లుర, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తామని అన్నారు.

బెనిఫిట్ షోకి అవకాశం ఉందని, కానీ స్వచ్చంద సంస్థల కోసం బెనిఫిట్ షోలు ఉంటాయని, ఆయా సంస్థలు జాయింట్ కలెక్టర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదనపు షోలు దొంగాటలేనని చట్టప్రకారం 4 షోలు మాత్రమే వేయాలని అన్నారు. తమ ప్రభుత్వానికి పెద్ద హీరో చిన్న హీరో అనేది లేదని, తాము ప్రేక్షకుల కోణంలో మాత్రమే చూస్తామని వివరించారు. వ్యతిరేకిస్తున్న ఒక పెద్ద హీరో ఏమి ఇబ్బంది ఉందొ చెప్తే.. అది సహేతుకమైతే పరిశీలిస్తామని తెలిపారు.

పర్యావరణ హితం కోసం గ్రీన్ టాక్స్ పెంచుతున్నాం:

పర్యావరణ హితం కోసమే కేంద్రం ఆదేశాల మేరకు గ్రీన్ టాక్స్ పెంచుతున్నామని, పాత వాహనాలను నిరుత్సాహ పరిచి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆటో, టూ వీలర్స్‌కి ఈ పెంపుదల ఉండదని, రూ. 20 లక్షలు పైబడిన వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.