AP Vote on Account Budget Highlights: ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పూర్తి హైలెట్స్ ఇవిగో, రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం

రూ.2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆయన సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు ఉండగా రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు ఉంది.

Buggana Rajendranath (photo-Video Grab)

Andhra Pradesh Assembly session 2024:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌)ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆయన సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు ఉండగా రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు ఉంది.

ఇక జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతంగా ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్‌ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు.

రూ.2లక్షల 86వేల 389కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌, రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లని తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని పేర్కొంది. పన్నేతర ఆదాయంగా రూ.14,400 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని పేర్కొంది. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు.

పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.మహత్మాగాంధీ సందేశంతో బడ్జెట్‌ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఐదేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన సభకు వివరించారు.

విశాఖపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, ఆర్థికంగా ఎదగడానికి పెద్ద నగరం చాలా అవసరమని వెల్లడి, ఏపీ ముఖ్యమంత్రి పూర్తి ప్రసంగం హైలెట్స్ ఇవిగో..

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి కూడా భారీగా నిధులు కేటాయించింది.బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.71,740 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. బీసీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాధాన్యాతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.2019 వరకూ రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా వైసీపీ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలను నిర్మించింది. 5 ఏళ్లుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు ఖర్చు చేశాం.నగదు బదిలీ ద్వారా 2.53 లక్షల కోట్లను పంపిణీ చేశాం.పెన్షన్ కానుక ద్వారా 84 వేల కోట్లను అందించాం. ఐదేళ్లలో ప్రజాపంపిణీలో ఇంటి ముందుకే సరుకులను పంపేలా సంచార పంపిణీ వాహనాలు ప్రవేశపెట్టాం. తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కూడా దొరికిందని బుగ్గన తెలిపారు.

రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో నాలుగు ఓడ రేవుల నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఓడ రేవుల ద్వారా 75 వేల మంది కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయనున్నారు. వీటికి గాను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10,107 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో10 కొత్త మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రులు, నాలుగు ఇతర ఆస్పత్రులు, మూడు నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి (YS Rajashekar Reddy), రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) వంటి దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలనను సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) అన్నారు. రాష్ట్ర సమస్యలను పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామన్నారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారిత అందించామన్నారు. విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్రవేశపెట్టిందని తెలిపారు. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్ధులను సీబీఎస్ఈ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్య ప్రణాళిక, ప్రతీ విద్యార్ధికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేశామని చెప్పారు. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. 2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలను స్థాపించాం. తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వాహబ్‌గా తయారైంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.వైద్యారోగ్య రంగంలో ‘నాడు నేడు’ పథకం అమలు చేశాం. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ రూ.16,852 కోట్లు వ్యయం చేశాం. 53.58 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్ల మేర రైతు భరోసా ఆర్థిక సాయం అందించామన్నారు.



సంబంధిత వార్తలు