Andhra Pradesh Assembly budget session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి (Andhra Pradesh Assembly Budget Session) టీడీపీ సభ్యులు తమ నిరసనలతో సభకు ఆటంకం కలిగించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు.
అసెంబ్లీలో (Andhra Pradesh Assembly budget session 2024) సీఎం జగన్ మాట్లాడుతూ. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి. మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు (Chandrababu) ప్రచారం చేస్తన్నారు. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది.ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కలుపుకుంటే రూ.2 లక్షల 26 వేల 140 కోట్లు ఖర్చు అవుతుంది.మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుందనని ప్రశ్నించారు.
మనం చేసిన 2,91,000 కోట్ల అప్పును ఒకరు 13 లక్షల కోట్లు అంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుటుంబాలకు ఏ మంచి చేయలేదు. ఎక్కడా ఈ విషయాన్ని చెప్పుకోనూ లేడు. ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రసంగాల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. పది సంవత్సరాల బ్యాంక్ అకౌంట్‌లో బాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వారికి చేరిందా అని వాళ్లనే చూసుకోమంటున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్ ఉన్నా.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారినా ఎందుకు బాబు హయాంలో ఎక్కువ అప్పులు చేసినా ఎవరికీ లబ్ధి ఎందుకు చేకూర్చలేకపోయారు? ఆడబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి చేరాయో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది. 2019 మే నెల నాటికి రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం.ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉంది.మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువ తీసుకున్నాం. ఈనాడు, టీవీ-5, ఆంధ్రజ్యోతి వంటి వాళ్లు మనపై చేసే ఇంకో ఆరోపణ విపరీతంగా అప్పులు చేశారని! హద్దు పద్దూ లేకుండా లక్షల కోట్లు చేసేశారని ఆరోపిస్తూంటారు. కాగితాలు చించి స్పీకర్ మీద వేస్తారా, అసలు సభలో మీరు ఉంటారా? మార్షల్‌తో నెట్టించుకుంటారా?, టీడీపీ సభ్యులపై మండిపడిన అంబటి రాంబాబు, వీడియో ఇదిగో..
గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 132000 కోట్లు (రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినవి.. చేసిన అప్పులు కలిపి). గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు. బాబు హయాంలో అప్పులు పెరిగింది 21.87 ఏడాదికైతే... మన హయాంలో కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ... అది 12.13 శాతం మాత్రమే. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో కంటే.. అభివృద్ధి కోసం అదనంగా మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో రూ. 15,227 కోట్లు సగటున ఖర్చు చేస్తే.. మా హయాంలో రూ.17,757 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
సంపద సృష్టించానని బాబు ప్రతీ మీటింగ్‌లో చెబుతున్నారు. బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుందని మండిపడ్డారు. తల్లికి వందనం అంటూ చంద్రబాబు మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు.వేరే రాష్ట్రాల్లో ప్రజల్ని ఆకట్టుకున్న వాగ్ధానాల్ని తీసుకొచ్చారు. మా హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చాం. 8 పథకాలకే రూ. 52 వేల కోట్లు ఖర్చు చేశాం. 650 వాగ్ధానాలతో గత మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు. వాటిలో పదిశాతం హామీలే చేశారని విమర్శించారు.
ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలి.అలాంటి పవర్‌హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు.ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం.రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది.రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది.అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నా
రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం.ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి.ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదని సీఎం జగన్ తెలిపారు.
ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? వీళ్లు ఏ ఒక్కరు కూడా అధికారం అన్నది ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించుకోవాలని రావడం లేదు. ప్రజలను మోసం చేసేందుకు వీళ్లు దోచుకుని, పంచుకునేందుకు మాత్రమే వీళ్లకు అధికారం కావాలి. మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది.పేదలకు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారని మండిపడ్డారు.
పక్క రాష్ట్రాల్లోని వాగ్ధాలను మేనిఫెస్టోలో పెడుతున్నాడు.కనీసం పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదు.ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు కనిపిస్తాయి.
1994, 1999 -2014లో ఇచ్చిన మేనిఫెస్టోల్లోనూ ఇవే మోసాలు కనపడతాయి.తొలి సంతకాలు, సామాజిక వర్గాలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఇచ్చిన దాదాపు 655 వాగ్దానాలుచ్చి.. వాటిల్లో పది శాతం కూడా తీర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేశాడంటే పరిస్థితి ఏమిటన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తిని 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అన్నది ప్రజలు ఆలోచించాలి.ఎలాగూ ప్రజలు తమకు అధికారం ఇవ్వరని అనుకుంటున్న చంద్రబాబు గ్యాంబ్లింగ్ తరహాలో హామీలిస్తున్నాడు. వేర్వేరు రాష్ట్రాల్లోని హామీలను పట్టుకుని పేకాట ఆడటం మొదలుపెట్టాడని విమర్శించారు.
నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు.చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు.ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్ తెస్తారు.ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదు.చంద్రబాబు పాలన అధ్వాన్నంగా సాగిందని దుయ్యబట్టారు.
బాబు వయసు 75. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయ్యింది. మొదటిసారి సీఎం అయి కూడా 30 ఏళ్లు అవుతోంది. మూడుసార్లు సీఎం అయిన తరువాత కూడా ఇప్పటికి కూడా.. ఫలానా పని చేశా కాబట్టి నాకు ఓటేయండి ఆయన అడగలేకపోతున్నాడు. మరోసారి ఛాన్స్ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని మాత్రమే అంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచన చేయాలి. బాబు మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమైనా ఉందా? అన్నది కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఆలోచించాలి. మేనిఫెస్టో అంటే లావు పుస్తకం పెడతారు వాళ్లు.ప్రతి సామాజిక వర్గానికీ బోలెడన్ని హామీలిస్తాడు.ఎన్నికల తరువాత ఆ మేనిఫెస్టో ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు. ఆన్‌లైన్‌లోనూ కనిపించదని ఎద్దేవా చేశారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ చిత్తశుద్ధి, పట్టుదల, నిబద్ధతలతో రాష్ట్రంలో రైతన్నలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాల సంక్షేమం కోసం ఎలా అడుగులు ముందుకేసామో చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుంది. కేంద్రం నుంచి ఆశించినంత మేరకు నిధులు రాకపోయినా బాబు చేసిన అప్పులకు వల్లమాలిన వడ్డీ కట్టుకుంటూ.. కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగినా ఎన్ని కారణాలున్నా.. ఇబ్బందులన్నా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో పనిచేశామని, మేనిఫెస్టోలో 97 శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా అవతరించామని తెలిపారు.
14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రానికి ప్రజలకు పనికిరాని అనుభవం ఎందుకు? మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చేసి చూపించాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదలకు ఇచ్చాం. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా తాపత్రయం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం.. పేదలకు అండగా నిలిచామని సీఎం జగన్ అన్నారు.
ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోంది. మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఈ మాత్రం చేయగలిగామనేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. జనాలకు మంచి చేశామన్న సంతృప్తి మాకు ఉందని తెలిపారు.
లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన అందించాం..రూ.2లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం
దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ.గోల చేసే వాళ్లు ఎక్కువ.. ఒకే విషయాన్ని మళ్లీమళ్లీ చెబుతూ గందరగోళం సృష్టించే వాళ్లూ ఎక్కువే.కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ తక్కువని వీరు ఆరోపణలు చేస్తూంటారు. జగన్ కేవలం బటన్‌లు మాత్రమే నొక్కుతూంటారన్నది కూడా అబద్ధం.సమర్పించిన అంకెలన్నీ కాగ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినవే, కడుతున్న మూడు పోర్టులను కూడా కలుపుకుంటే ఈ మొత్తానికి ఇంకో పన్నెండు వేల కోట్లు చేర్చాల్సి వస్తుందని సీఎం జగన్ అన్నారు.
మనది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీ.తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ.రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టారు.విభజన కారణంగా ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోయాం.ఈ ఐదేళ్లలో లక్ష కోట్ల అదనపు ఆదాయం కోల్పోయాం.కనీస చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు.ఆ లోటు ఇప్పటికీ వెంటాడుతోందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి.రైతులను చంద్రబాబు మోసం చేశారు.ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదు.పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు.
2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమే.15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కింది.బాబు హయాంలో 35 శాతం వరకైనా తగ్గింది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయని సీఎం అన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో..
2018 - 19లో 32780 వేల కోట్లు వస్తే
2019- 20లో 28000 కోట్లు
2020-21 - 24000 కోట్లకు
2021-22 - 36 వేల కోట్లు
2023-23లో 38 000 కోట్లకు చేరుకుంది. కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం.ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయి
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయి.ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని సీఎం అన్నారు. మూడేళ్లలో రాష్ట్రం 66 వేల కోట్లు ఆదాయం నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు.
సంప్రదాయం ప్రకారం.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం ఈ సమావేశాల్లో తెలపనున్నాం. జూన్‌లో కొలువుదీరబోయే మన ప్రభుత్వం.. ఇదే సభలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తుంది. ఇప్పటిదాకా ఐదు ప్రజా బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం.ప్రతిపక్షం వేస్తున్న నిందలు.. వాస్తవాలేంటన్నది ప్రజలకు వివరించబోతున్నాం
కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం. ఈ ఐదు సంవత్సరాల్లో అనూహ్య పరిస్థితులెన్నో చూశాం.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షోభం ఎప్పుడూ రాష్ట్రం చవిచూడలేదు.గత ప్రభుత్వ పాలన ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించింది. ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించామని సీఎం తెలిపారు.