Atmakur Bypoll 2022: ఆత్మకూరు ఉప ఎన్నిక, లక్ష మెజార్టీ లక్ష్యంగా 7 మంది మంత్రులను ఇంచార్జిలుగా నియమించిన వైసీపీ, ఉపఎన్నిక బరిలో 28 మంది అభ్య‌ర్ధులు

ఏపీ దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉపఎన్నిక (Atmakur Bypoll 2022) బరిలో దిగేందుకు ఏకంగా 28 మంది అభ్య‌ర్ధులు సిద్ధమ‌య్యారు.

YSRCP vs BJP (File Image)

Atmakur, June 6: ఏపీ దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉపఎన్నిక (Atmakur Bypoll 2022) బరిలో దిగేందుకు ఏకంగా 28 మంది అభ్య‌ర్ధులు సిద్ధమ‌య్యారు. ఈ ఎన్నిక‌లో అధికార పార్టీ నుంచి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి (Mekapati Vikram Reddy) నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో చ‌నిపోయిన నేత‌ల కుటుంబ స‌భ్యుల‌కే టికెట్ ఇస్తే పోటీ చేయ‌రాద‌న్న సంప్ర‌దాయాన్ని గౌర‌వించిన టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది.

ఇక విక్ర‌మ్ రెడ్డితో పాటు ఇప్ప‌టికే చాలా మంది ఈ ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. సోమ‌వారం నామినేష‌న్ల గ‌డువుకు చివ‌రి రోజు కావడంతో ఈ ఒక్క‌రోజే ఏకంగా 13 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. వెర‌సి ఈ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టిదాకా 28 నామినేష‌న్లు దాఖ‌లైనట్లైంది. అయితే నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసేలోగా వీరంతా బ‌రిలోనే నిలుస్తారా? త‌ప్పుకుంటారా? అన్న‌ది తేలాల్సి ఉంది. జూన్ 23న ఆత్మకూరు నియోజకవర్గానికి బైపోల్ (Byelection in Atmakur on June 23) జరగనుంది.

భూ వివాదాలను పరిష్కరించడమే సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యం, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

ఈ ఉప ఎన్నిక‌ల్లో ల‌క్ష ఓట్ల మెజారిటీ ల‌క్ష్యంగా అధికార వైసీపీ (YSRCP) అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌పై వైసీపీ దృష్టి సారించింది. ఉప ఎన్నికలో ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీని నిర్దేశించుకున్న ఆ పార్టీ... అందుకోసం భారీగా నేత‌ల‌ను రంగంలోకి దింపుతోంది. ఆత్మ‌కూరు అసెంబ్లీ ప‌రిధిలో 7 మండ‌లాలు ఉండ‌గా... ఒక్కో మండ‌లానికి ఒక్కో మంత్రిని ఇంచార్జీగా నియ‌మించింది. మంత్రికి స‌హ‌కారం అందించేందుకు ఒక్కో నియోజక వ‌ర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను కూడా ఆ పార్టీ బ‌రిలోకి దించుతోంది. మొత్తంగా భారీ సంఖ్య‌లో నేత‌ల‌ను దించి అనుకున్న మెజారిటీ సాధించే దిశ‌గా వైసీపీ పావులు క‌దుపుతోంది.

ఆత్మకూరు ఉఎ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఇంచార్జిల నియామకం

అనంతసాగరం మండలం- మంత్రి మేరుగ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఎఎస్‌పేట మండలం- మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి

ఆత్మకూరు అర్బన్‌- మంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌

ఆత్మకూరు రూరల్‌- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తోపుదుర్తి

చేజర్ల మండలం- మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే కొడాలి నాని

మర్రిపాడు- మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సంగం మండలం: మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ (BJP) అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు.వైసీపికి దమ్ముంటే ఓట్లు కొనకుండా స్వచ్ఛందంగా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. టీడీపికి స్థిరమైన సిద్ధాంతం లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి చేతనయితే మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపకుండా కేవలం అభ్యర్థులే ప్రచారంలో పాల్గొని లక్ష మెజారిటీతో గెలుపొందాలన్నారు.