Andhra Pradesh Cabinet Meeting: ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు, పాత విధానంలోనే టెండర్ల ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది.

AP Cabinet Meeting (photo-X/TDP)

Vjy, August 28: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) రద్దుకు ఆమోదం తెలిపింది.

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మరోసారి విదేశాలకు వైఎస్ జగన్, ఈసారి ఎన్ని రోజులో తెలుసా?, సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుకేకు వైసీపీ అధినేత!

అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు ఏపీకి రెండు ఇండస్ట్రియల్ హబ్ లు ప్రకటించిన నేపథ్యంలో, సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీకి చారిత్రాత్మక దినం అని, ఇదొక శుభారంభం అని చంద్రబాబు అభివర్ణించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి ఈ ప్రకటన మంచి ఊతమిస్తుందని, ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తుందని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తిగా జాతీయ ప్రాజెక్టు అని వెల్లడించారు. ఫేజ్-1 కింద ప్రాజెక్టు వ్యయం రూ.30,436.95 కోట్లు అని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికి రూ.4,730 కోట్లు పెట్టుబడి పెట్టామని తెలిపారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి, మిగిలిన మొత్తాన్ని కేంద్రం భరించేట్టు ఒక అవగాహనకు వచ్చామని చంద్రబాబు వివరించారు.

బ్యాలన్స్ అమౌంట్ చూసినప్పుడు రూ.25,706 కోట్లు అని, అందులో ఇంతవరకు విడుదల చేసింది రూ.15,146 కోట్లు అని స్పష్టం చేశారు. భూసేకరణ, పునరావాసం వ్యయం పోగా... రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వివరించారు. 2024-25కి రూ.6 వేల కోట్లు... 2025-26కి రూ.6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని తెలిపారు.

ఇక, తాజాగా ప్రకటించిన కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లు, ఇంతకుముందు ప్రకటించిన మరో రెండు హబ్ లతో కలిపి ఏపీలో ఇండస్ట్రియల్ హబ్ ల సంఖ్య నాలుగుకు చేరిందని వివరించారు. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఏపీలో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం కలుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి అవకాశాలు ఉంటే, వాటిని ఉపయోగించుకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఇదంతా మా ఘనతే అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చారని గత ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు.

వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్లను ఏం చేస్తారో తెలియదు కానీ, మన దేశంలో కాబట్టి ఇలా జరిగిపోతోంది అని వ్యాఖ్యానించారు.