YSR Rythu Bharosa: మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం రాదు, మీ ఇంట్లో మంచి జరిగితేనే సైనికులుగా నిలబడండి, వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత పెట్టుబడి సాయానికి నిధులను (YSR Rythu Bharosa) ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశారు. ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించగా తాజాగా రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల లబ్ధి చేకూరింది.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు ఏనాడూ ప్రజలు, పేదవాడి గురించి ఆలోచించలేదని విమర్శించారు.సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు హయంలో స్కాంలు తప్ప స్కీమ్‌లు గుర్తుకు రావు. బాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్‌లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబు పదవి కావాలి. చంద్రబాబు పాలనలో ప్రజలు, పేదలు, వృద్ధులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదు. బాబు పాలనలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించి పాలన జరిగింది.
మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం రాదు. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుసు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే చూడండి. మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి. గెలవడానికి ఒక దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు. గెలవడానికి పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులే. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే. నాకు మద్దతు ఇవ్వాలని దత్తపుత్రుడిని మీ బిడ్డ కోరడు. నాకు సపోర్ట్ చేయాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5ని మీ బిడ్డ ఏనాడూ కోరడు. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉంది. రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయి.. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామంటారు.. అవన్నీ అబద్దాలే. మీ బిడ్డకు ఎల్లో మీడియా అండదండలు లేవు. మీరు మాత్రమే ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.