Andhra Pradesh: ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయండి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విన్నవించిన సీఎం జగన్

ఢిల్లీ పర్యటనలో భాగంగా.. బుధవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీకి సంబంధించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు పలు కీలక అంశాలపైనా కేంద్రమంత్రికి విన్నవించారు.

CM YS Jagan meets union Minister Bhupender Yadav (Photo-Twitter/APCMO)

Vjy, Dec 28: ఢిల్లీ పర్యటనలో భాగంగా.. బుధవారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. ఏపీకి సంబంధించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు పలు కీలక అంశాలపైనా కేంద్రమంత్రికి విన్నవించారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు. కరవుతో అల్లాడే ఈప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైనది వివరించారాయన. అలాగే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను కేంద్ర మంత్రికి తెలియజేశారు.

ప్రధాని మోదీ ముందు సీఎం జగన్ ఉంచిన సమస్యలు ఇవే, ప్రధానంగా విభజన చట్టంలో సమస్యలు పరిష్కరించాలని వినతి

మరోవైపు కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు సూచించిన అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ ఉల్లంఘిస్తోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ తనకు కృష్ణా నదిపై తనకున్న వాటా హక్కులను కోల్పోవాల్సి వస్తోందని సీఎం జగన్‌ తెలియజేశారు.

2022–22, 2022–23 సంవత్సరాలలో తెలంగాణా రాష్ట్రం– సీజన్‌ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్‌ 1తేదీ నుంచే.. విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో కనీస స్ధాయి నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి నీటి విడుదల చేయడంతో పాటు, కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) ముందు కనీసం ఎలాంటి ఇండెంట్‌ కూడా లేకుండా ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి విడుదల చేసిందని సీఎం జగన్ తెలిపారు.

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ, ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం, ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై చర్చలు

నీటి పారుదల అవసరాలకు విద్యుత్‌ ఉత్పత్తి అన్నది కేవలం యాధృచ్చికంగా మాత్రమే ఉంటుంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల.. శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఇంతకు ముందే కేంద్రం దృష్టికి తీసుకువచ్చాం అని సీఎం జగన్‌.. కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు.

శ్రీశైలంలో జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప.. పోతిరెడ్డిపాడునుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యంకాదని సీఎం వైఎస్‌ జగన్‌, కేంద్రమంత్రికి వివరించారు. పోతిరెడ్డి పాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నై మహానగరానికి తాగు నీరు అందించడం సాధ్యం కాదని తెలిపారు.

అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని సీఎం జగన్‌ వివరించారు. ఈ ప్రాజెక్టుల వలన రిజర్వాయరు నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదని కేంద్రమంత్రికి స్పష్టం చేశారు .

ఈ పరిస్థితుల నేపధ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం(ఆర్‌ఎల్‌ఎస్‌)ను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని టీజీపీ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌లకు సరఫరా చేయగలుగుతామని సీఎం జగన్‌, కేంద్రమంత్రికి తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అటవీపర్యావరణ శాఖ అధికారులకు మధ్య సమగ్ర చర్చలు జరిగాయి. అందుకు అవసరమైన మొత్తం సమాచారం కూడా ఇప్పటికే అందించామని, ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, ప్రాజెక్టు ఎకో సెన్సిటివ్‌ జోన్‌(ఈఎస్‌జెడ్‌) నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు ఇది కూడా కేవలం ప్రధాన కాలువకు పూర్తి స్ధాయిలో నీటిని అందించడం కోసమేనంటూ కేంద్రమంత్రికి వివరాలు అందించారు. వీలైనంత త్వరలో రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారాయన.

ఆంధ్ర ప్రదేశ్‌.. 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు తీరప్రాంతంలో సుమారు 10 లక్షల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధిగా చేపలపట్టడంతో పాటు, మత్స్య అనుబంద కార్యకలాపాలపై ఆధాపడి ఉన్నారు.

ఈ బలహీన వర్గాలను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 9 వ్యూహాత్మక ప్రదేశాలలో ఫిషింగ్‌ హార్భర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చింది. రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి, 2024 నాటికి పోర్ట్‌ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి.

మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరు కోసం దరఖాస్తు చేశాం. ఇందుకు అవసరమైన సమచారాన్ని కూడా అందజేశాం. ఈ పనులను ఏపీ ప్రభుత్వం వీలైనంత వేగంగా ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన అనుమతులు మంజూరుకు మీ సహకారం అందించాలని కోరుతున్నాం అని కేంద్రమంత్రిని కోరారు.

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిల్వలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టంది. 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్‌ జీరో 2070 లక్ష్య సాధనకు ఇది ఉపయోగపడుతుందంటూ వివరించారు.

పంప్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందంజలో ఉందని, అదే విధంగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ప్రమోషన్‌ కోసం పాలసీని కూడా రూపొందించిందని, ఆ తరహా ప్రాజెక్టులలో ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల ఏర్పాటు జరుగుతోందని, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా గండికొట వద్ద 1000 మెగావాట్స్‌ పంప్డు స్టోరేజీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ప్రతిపాదన పంపించింది. ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులు కూడా సకాలంలో ప్రభుత్వానికి సమర్పించనున్నామని వెల్లడించించారు. వీటితో పాటు ఏపీ ప్రభుత్వం లోయర్‌ సీలేరు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు(1350 మెగావాట్లు) సామర్ధ్యంతో చేపడుతోందని, వీటికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కోసం దరఖాస్తు చేశామని, రాష్ట్ర ప్రగతికి అవసరమైన ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలంటూ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు రిక్వెస్ట్‌ చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now