CM Jagan's Delhi Tour: మూడు రాజధానులు ఏర్పడటం ఖాయం, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా కేంద్రం సహకారం తప్పక ఉంటుంది, సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షానికి అంత కడుపు మంట ఎందుకు? మీడియాతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
పోలవరం, విభజన హామీలు, పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఈ పర్యటనలో కేంద్రం ముందుంచారని ఆయన స్పష్టం చేశారు.
Amaravati, June 12: రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగిందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Government Advisor Sajjala Ramakrishna Reddy) తెలిపారు. పోలవరం, విభజన హామీలు, పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఈ పర్యటనలో కేంద్రం ముందుంచారని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు విపక్షం ఎన్ని కుట్రలు చేసినా వికేంద్రీకరణ జరిగి తీరుతుందని సజ్జల స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
సీఎం అధికారిక పర్యటన (CM Jagan's Delhi Tour) వల్ల సమస్యల పరిష్కారంలో మరింత చొరవ పెరిగే వీలుందన్నారు. రాష్ట్ర పురోగతిని వివరించి కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు సీఎం పర్యటన తోడ్పడుతుందన్నారు. కోవిడ్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కకావికలమైనా సీఎం జగన్ (Andhra pradesh CM YS Jagan Mohan Reddy) సంక్షేమ రథాన్ని ముందుకు నడిపారని చెప్పారు. సీఎం ఢిల్లీ పర్యటనపై పనిగట్టుకుని ఎల్లో మీడియా రాద్దాంతం చేచేస్తోందని.. అసలెందుకీ కడుపు మంట అంటూ మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిస్తే ఒక ఏడుపు.. ఆయనకు పనులుండి కలవకపోతే మరో ఏడుపా? అని ప్రశ్నించారు.
ఏవైనా పనులుండి మంత్రితో భేటీ కుదరకపోతే అదేమైనా పెద్ద తప్పా? కేసుల కోసమే ప్రతీసారీ ఢిల్లీ వెళితే... కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్రపూరితంగా సీఎం జగన్‌పై పెట్టిన తప్పుడు కేసులు ఎప్పుడో కొట్టేసి ఉండాలి కదా? ఇవన్నీ తప్పుడు కేసులని ప్రజా న్యాయస్థానం అనేక సార్లు తిప్పికొట్టింది. అందుకే ప్రజలు కాంగ్రెస్, టీడీపీని భూస్థాపితం చేశారు. కేసుల కోసం ఎవరి పంచనో చేరే మనస్తత్వం జగన్‌ది కాదు. కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఆశయాన్ని వీడలేదని గుర్తుంచుకోవాలని ఆయన ప్రతిపక్ష టీడీపీపై మండిపడ్డారు.
ఢిల్లీలో సీఎం పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పోలవరం తన ఘనతేనంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం సిగ్గుచేటు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారు. ఆయన హయాంలో పనులే జరగలేదు. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక కోవిడ్ ఉన్నా పనుల్లో వేగం పెరిగింది. వచ్చే ఏడాది పోలవరం నీళ్లిస్తాం. పౌర సరఫరాల ద్వారా అందే ధాన్యాన్ని పెంచాలని కేంద్రాన్ని సీఎం కోరారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా 30 లక్షల ఇళ్లను రాష్ట్రం నిర్మిస్తోంది. 15 లక్షలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ పథకానికి సాయం చేయాలని నీతి ఆయోగ్‌ను కోరాం. మౌలిక సదుపాయాలకు రూ. 34 వేల కోట్లు కావాలని తెలిపాం.అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని అడిగామని సీఎం కోరారు.
న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికార వికేంద్రీకరణ జరగడం ఖాయం. మూడు రాజధానులు ఏర్పడటం ఖాయం. ఇది ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితో ప్రకటించారు. దీనికి కేంద్ర సహకారం ఉంటుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సాయం కోరారు. సీఎం పర్యటనలో ఏదీ వ్యక్తిగతం లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని కోరాం. ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్‌ను బతికించేందుకే మా పార్టీ ప్రయత్నిస్తోందని సజ్జల తెలిపారు.
అవకాశం వచ్చినప్పుడు సాధించే దిశగా కృషి చేస్తున్నాం. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మేం బలహీనంగానే ఉన్నాం. వ్యవస్థల్లో తను వేసిన వట వృక్షాల ఆధారంగానే చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణను దేవస్థానం బోర్డు ఘనంగా స్వాగతించింది. ప్రభుత్వం నుంచి మంత్రిని పంపలేదని రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు.