New Government Medical Colleges in AP: ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కాలేజీ, రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలని తెలిపిన సీఎం జగన్
శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించిన సీఎం జగన్.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు.
విజయనగరం,సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రారంభించిన సీఎం జగన్.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు 5 మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రారంభించాం. ఐదు చోట్ల ఫస్టియర్ అడ్మిషన్లకు కూడా ఈరోజు పిల్లలను తీసుకొనే పరిస్థితిలోకి అడుగులు వేగంగా ముందుకు వేయగలుగుతున్నాం. దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మీరంతా గొప్ప డాక్టర్లు కావాలి. మీరంతా అత్యున్నత స్థాయికి చేరుకోవాలి అని విద్యార్థులను ఉద్దేశించి ఆకాంక్షించారు.
స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కాలేజీ ఉండబోతోంది. ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం. ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తాం.
ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడం కోసం దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు చేరుతుంది. ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
మంచి డాక్టర్లు అయ్యి.. ప్రజలకు ఉపయోగపడాలి. ఇదే నేను మీ నుంచి కోరుకుంటున్నా. అందుకే ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదని తెలిపారాయన. రాబోయే రోజుల్లో.. వెనకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్యసదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఉండనుందని సీఎం జగన్ తెలిపారు.
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. హెల్త్ సెక్టార్‌లో 53 వేలమందిని రిక్రూట్ చేశాం. కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తాం. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని సీఎం జగన్ వివరించారు.