Vizianagaram, Sep 15: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అనంతరం.. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలను ప్రారంభించారు.సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఈ పర్యటనలో ఉన్నారు.
కాగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది.
రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది.