AP Assembly Session 2021: పోటీ పరీక్షలకు ఒకటో తరగతి నుంచే బీజం వేస్తున్నాం, 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారు, విద్యారంగంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఏపీ సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని, ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు.
Amaravati, Nov 26: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఏడురోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో (AP Assembly Session 2021) మొత్తం 26 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నేటి ఏడవరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యారంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ (CM YS jagan Mohan Reddy) మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని, ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం (English Medium) కోరుతున్నారని పేర్కొన్నారు. రైట్ టు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మారుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అంగన్‌వాడి నుంచి ఇంగ్లీష్ మీడియం వైపు పిల్లలను మళ్లించాలని తెలిపారు. విద్యాపరంగా సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విద్యారంగంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపడుతున్నామని తెలిపారు. 20 మంది పిల్లలకు ఒక టీచర్‌ను.. అదే విధంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించామని సీఎం తెలిపారు.
అమ్మఒడి పథకంలో (Amma Vodi) విద్యార్థుల తల్లులను భాగస్వామ్యం చేశామని చెప్పారు. పిల్లలను బాగా చదివించేందుకు జగనన్న గోరుముద్దు పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. 44.50 లక్షల మంది విద్యార్థుల తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. అమ్మ ఒడి పథకం ద్వారా 85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని సీఎం జగన్ తెలిపారు. అమ్మఒడి పథకం క్రింద ఏడాదికీ రూ.6,500 కోట్లు కేటాయించామని తెలిపారు.
జగనన్న గోరు ముద్ద పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించామని చెప్పారు. విద్యార్థులకు విద్యాకానుక, తల్లులకు అమ్మ ఒడి పథకాలను తీసుకువచ్చామని.. గోరుముద్దు కోసమే రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.2 ఏళ్ల కాలంలో అమ్మఒడి పథకానికి రూ.13,023కోట్లు కేటాయించామని చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లులో విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు. గతంలో చదువుకునే స్థాయి నుంచి చదువుకొనే స్థాయికి తెచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం చదువును కొనుక్కునే పరిస్థితి తెచ్చిందని, ప్రభుత్వం స్కూళ్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్‌కు పట్టం కట్టారని సీఎం జగన్ అన్నారు.
నాడు-నేడుతో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. నాడు-నేడుతో 57,189 ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి జరిగిందని సీఎం అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు రావాలని తెలిపారు. పెద్ద చదువులు చదివే పిల్లలకు జగనన్న దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని సీఎం తెలిపారు.
1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమ్మఒడి తీసుకోని విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థ యాజమాన్యాలకు మంచి జరగాలన్నారు. గత 20 ఏళ్లుగా ఎయిడెడ్ టీచర్ పోస్టులు భర్తీ చేయటంలేదని అన్నారు. ఎయిడెడ్ సంస్థలకు మంచి చేసేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నామని తెలిపారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ అన్నారు. విద్యావిధాన్ని బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంత పెట్టదని చెప్పారు. నిర్ణయం తీసుకునే అవకాశం ఆయా విద్యాసంస్థలకే ఇచ్చామని తెలిపారు. చదువే అసలైన ఆస్తి.. చదువే అసలైన సంపద అని సీఎం జగన్ తెలిపారు.