Andhra Pradesh: వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం, అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ, సెలెక్ట్ కమిటీకి 'రాజధాని' బిల్లులు, ఇక ముందు జరగబోయేదేమిటి? విశ్లేషణాత్మక కథనం
మండలి యొక్క అధికారాలు చాలా పరిమితం.....
Amaravathi, January 23: బలం ఉండగానే సరిపోదు సరైన వ్యూహాం లేకపోతే ఎంతటి బలవంతుడైనా బలహీనుడే. రాజకీయ అనుభవం ముందు అధికారం చిన్నబోయింది. జగన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఎం.ఎ షరీఫ్ (MA Shariff) బుధవారం తన స్వంత అభీష్టానుసారం రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధించిన రెండు బిల్లులు.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు (Decentralization) మరియు AP క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA) ను రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీ (Select Committee) కి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఆ రెండు బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొందినా, ఎగువ సభ అయినటువంటి శాసన మండలిలో అటు ఆమోదం పొందకుండా లేదా తిరస్కరణకు గురికాకుండా మధ్యలోనే నిలిచిపోయాయి. ఇక్కడే ప్రభుత్వానికి ఇప్పుడు ఈ బిల్లులపై ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా శాసనసభలో 151 మంది సభ్యులతో తిరుగులేని మెజారిటీ గల జగన్ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఆ బిల్లులను ఆమోదించుకోవడం అత్యంత తేలికైన పని. అనుకున్నట్లుగా ఆ రెండు బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొంది శాసన మండలి (Legislative Council) చేరాయి.
58 మంది సభ్యులుండే శాసనమండలిలో 29 మంది ఎమ్మెల్సీలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి మంచి మెజారిటీ ఉంది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 9 మంది సభ్యుల సంఖ్యా బలం మాత్రమే కలిగి ఉంది. అంతేకాకుండా, మండలి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులు సైతం టీడీపీ నుంచి ఎన్నికైన వారే ఉన్నారు. ఈ ఒక్క చైర్మన్ స్థానం చాలు, బలాబలాలతో సంబంధం లేకుండా, నియమ నిబంధనలతో సంబంధం లేకుండా, పరిస్థితులను బట్టి చైర్మన్ తన విచక్షణాధికారాలతో ఏ నిర్ణయమైన తీసుకునే అవకాశం ఉంది.
రూల్ 71 ప్రకారం టీడీపీ చర్చను ప్రతిపాదించడంతో టీడీపీ- వైసీపీ పక్షాల మధ్య రూల్స్- రెగ్యులేషన్స్ మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఇంకేం సభలో తీవ్రగందరగోళం మధ్యనే చైర్మన్ ఎం.ఎ షరీఫ్ నిబంధన 154 ప్రకారం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో చంద్రబాబు మొఖంలో చిరునవ్వు, టీడీపీ పక్షంలో హర్షాతిరేకాలు, ఇటు అసెంబ్లీలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే సీఎం జగన్ మొఖం మాత్రం వాడిపోయింది. ఇక వైసీపీ మంత్రులు, ఇతర నేతలు ఈరోజు బ్లాక్ డే అని, బ్లాక్ డే కంటే దారుణమైన రోజు అని తమ ఆక్రోశం వెలగక్కుతున్నారు. 'శుక్రవారం' అంటూ సీఎం జగన్‌ను రెచ్చగొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
శాసనమండలిలో బిల్లులు గట్టెక్కవని ప్రమాదం ఉందనీ తెలిసినా అందుకు తగిన వ్యూహాలు, చర్యలు సిద్ధం చేసుకోకుండానే అతివిశ్వాసంతో వాటిని కౌన్సిల్ కు పంపడం సీఎం జగన్ వ్యూహాత్మక తప్పిదమే.
ఎందుకంటే 'రాజధాని వికేంద్రీకరణ' అంశం నిన్న,మొన్నటిది కాదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే సీఎం జగన్ అమరావతి తరలింపు ఆలోచనలు చేశారు. ఎన్నో నెలల ముందు నుంచే ఈ కసరత్తు జరుగుతోంది. ఇంత సమయం వెచ్చించి కూడా సరైన వ్యూహాలు అమలు చేయలేకపోతే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. దీనికి అనుభవం, ప్రణాళిక అవసరం కేసీఆర్ లాంటి వారు, ముందుగా ప్రతిపక్షాన్ని పునాదుల నుంచి కదిలించి ఆ తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఎగువ సభలో సరైన బలం లేకపోయినా ఎన్నో బిల్లులను ఆమోదింపజేసుకుంది.
సెలెక్ట్ కమిటీ అంటే ఏమిటి? తర్వాత జరిగేదేంటి?
రాజధాని బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. దీని అర్థం, ప్రస్తుతం ఆ రెండు బిల్లులు ఇంకా శాసన మండలి పరిశీలనలోనే ఉన్నట్లు. ఆ పరిశీలన మొత్తం పూర్తైన తర్వాత బిల్లుల్లో సవరణలు కోరుతూ మళ్ళీ అసెంబ్లీకే పంపిస్తుంది. అలా ఆ బిల్లులు రెండో సారి అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది.
సెలెక్ట్ కమిటీలో మొత్తం 15 వరకు సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ 15 సభ్యుల్లో మండలిలో ఉన్న మెజారిటీ ప్రకారం చైర్మన్ నియమిస్తారు. అంటే ఎక్కువగా మళ్ళీ టీడీపీ సభ్యులే ఉంటారు. కమిటీకి బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ అమరావతి ప్రాంతంలో, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి దాని ప్రకారం బిల్లుల్లో సవరణలు చేస్తూ ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. దాని ప్రకారం ఆ బిల్లులు మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలి. ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఒక నెల నుంచి 3 నెలల వరకు పట్టొచ్చు. కమిటీ అవసరం అనుకుంటే మరింతకాలం పొడగించుకోవచ్చు కూడా. అయితే ఈ సెలెక్ట్ కమిటీ ద్వారా బిల్లుల ఆమోదంలో కొంతమేర జాప్యం జరుగుతుందే ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేదు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
"ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి, అసెంబ్లీ రెండో సారి ఏదైనా బిల్లును ఆమోదిస్తే, మండలి సభ్యులతో సంబంధం లేకుండా, మండలి కూడా ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది. మండలి యొక్క అధికారాలు చాలా పరిమితం. మేము ఈ రెండు బిల్లులను ఆమోదించడంలో ఆలస్యాన్ని మాత్రమే చేయగలం, పూర్తిగా అడ్డుకోలేం" అని ఒక టీడీపీ సీనియర్ నేత పేర్కొన్నారు. తన వివరాలు గోప్యంగా ఉంచాలని ఆయన కోరారు.