Amaravathi, August 21: గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతిపై అనేకానేకా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాజధానిని ఆచోటు నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఆ ప్రాంతంలో కృత్రిమ వరదలు సృష్టిస్తుంది అని ప్రతిపక్ష టీడీపీ పార్టీ భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తుంది.
టీడీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా వైసీపీ ముఖ్యనేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. అమరావతి పల్లపు ప్రాంతం, ఆ ప్రాంతానికి వరదముప్పు ఉందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందు మరో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో అమరావతి తరలిపోతుంది అనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లవుతుంది.
రాజధాని తరలింపు వలన ప్రభుత్వానికి వచ్చే లాభమేమిటి?
వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి అమరావతి అంశం మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడుతూ, తాము అన్నీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు (నరేంద్ర మోదీ, అమిత్ షా లకు) చెప్పే చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానానంతా దోచుకుందని, వారందరనీ చట్టపరిధిలోకి తేవడమే తమ ధృడ సంకల్పం అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నింటిపైన పున: సమీక్ష చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
విజయసాయి మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్‌గా చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు ప్రధాన బలం - 'ధనం'. కాబట్టి చంద్రబాబు ఆర్థిక మూలాలను వెతికివెతికి దెబ్బగొడుతున్నట్లుగా అర్థమవుతుంది.
పీపీఎలు, పోలవరం టెండర్లు, ఇసుక టెండర్లు, బందరు పోర్టు ఇలా గత ప్రభుత్వ హయాంలోని టెండర్లన్నింటిలో చంద్రబాబు అనుబంధ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి, ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి అనేది వైసీపీ చేసే ప్రధాన ఆరోపణ. కాబట్టి వాటన్నింటినీ జగన్ సర్కార్ రద్దు చేసింది.
ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత చంద్రబాబు (N. Chandrababu Naidu) ప్రభుత్వం దాదాపు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించింది. ఇందులో చాలా ఎకరాల భూములు ప్రస్తుతం చంద్రబాబు బినామిల పేర్ల మీదే ఉన్నాయని వైసీపీ భావిస్తుంది. కాబట్టి రాజధానిని ఈ ప్రాంతం నుంచి తరలిస్తే చంద్రబాబు అండ్ కో. కు భారీగా నష్టం జరుగుతుందని వైసీపీ భావించి ఉండవచ్చు.
ఈ విషయాన్ని సీఎం జగన్ ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసి ఉండవచ్చు. అందుకే అప్పుడు కూడా జగన్ పర్యటనపైన మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా తనపై ఫిర్యాదులు చేయడానికి జగన్, ప్రధానిని కలిశారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు అన్నీ చెప్పే చేస్తున్నాం అనే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు కూడా దానినే సూచిస్తున్నాయి.
అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవనాలన్నీ తాత్కాలిక భవనాలే, అక్కడ భూములు కోల్పోయిన రైతులు కూడా కొత్తగా నష్టపోయేదేమి లేదు. కాబట్టి అమరావతి పేరు మార్చకుండా రాజధానిని మాత్రం మరో చోటికి మార్చాలి అనే ఆలోచనను జగన్ సర్కార్ ఖచ్చితంగా అయితే చేసి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత పెద్దగా లేకపోతే జగన్ అమెరికా పర్యటన ముగించుకొని రాగానే రాజధాని మార్పుపై ప్రకటన వెలువడినా ఆశ్చర్యం లేదు. అందుకే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడేలా, ప్రజల్లో భావోద్వేగాలు పెంచేలా ప్రతిపక్షం నుంచి గట్టి ప్రయత్నమైతే జరుగుతుంది. టీవీ, పేపర్, సోషల్ మీడియా ఇలా మాధ్యమాలలో జగన్ పైనా, వైఎస్ఆర్సీ పార్టీపైన.. టీడీపీ + జనసేన పార్టీలు, నాయకులు వారి మద్ధతుదారులు భారీ స్థాయిలో వ్యతిరేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అందుకు తగినట్లుగా అధికార వైసీపీ కూడా కౌంటర్ ఇస్తూ పోతుంది.
ఇప్పుడు పవర్ ఉన్నోడిదే రాజ్యం. గతంలో జగన్ పై అవినీతిపరుడి ముద్ర వేసి ఆయనను జైలుకు పంపడంలో చంద్రబాబు కీలకపాత్ర వహించారు. ఇప్పుడు అదే అవినీతి దెబ్బతో చంద్రబాబును ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు. అంతటి బడా నేత కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరమే నేడు అజ్ఞాత జీవితం గడపాల్సిన పరిస్థితి. రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి నాటకీయ పరిణామాలు చేసుకోబోతున్నాయో చూడాలి.