Polavaram Project: పోలవరంపై కేంద్రం శుభవార్త, రూ.5,036 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్సు
ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్స్ (CWC recommended to Central Hydro Power Department ) చేసింది.
Polavaram, Dec 23: పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్రం శుభవార్తను అందించింది. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్స్ (CWC recommended to Central Hydro Power Department ) చేసింది. మార్చివరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పనకు రూ.2,242.25 కోట్లు, ప్రాజెక్టు పనులకు రూ.1,115.12 కోట్లలో (Rs.5,036 crore for Polavaram Project) ముందస్తుగా రూ.3,087.37 కోట్లు వెరసి రూ.5,036.32 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ శివ్‌నందకుమార్ సోమవారం సిఫార్సు చేశారు.
దీన్ని ఆమోదించిన కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్.. పోలవరానికి రూ.5,036.32 కోట్లను విడుదల చేయాలని ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గురువారం ప్రతిపాదనలు పంపారు. వాటిపై ఒకట్రెండు రోజుల్లో మంత్రి షెకావత్ ఆమోదముద్ర వేసి, ఆర్థిక శాఖకు పంపుతారని, రీయింబర్స్‌ంట్ రూపంలో మంజూరు చేయాల్సిన రూ.1,948.95 కోట్లను రెండు వారాల్లోగా విడుదల చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి వరకూ చేయల్సిన పనులకు అవసరమైన రూ.3,087.37 కోట్లను ముందస్తుగా విడుదల చేస్తామని తెలిపాయి.
వాటితో తొలిదశ పనులకు నిధుల సమస్య ఉత్పన్నం కాదని.. ఈలోగా 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,458.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ కొలిక్కి వస్తుందని వెల్లడించాయి. సవరించిన అంచనా వ్యయంపై కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేస్తే.. పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అంటే గరిష్ఠ నిల్వ 194.6 టీఎంసీలను నిల్వచేసే స్థాయిలో పూర్తిచేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
కాగా ప్రాజెక్టు సత్వర పూర్తికి వీలుగా అడ్‌హక్ (ముందస్తు)గా రూ.పది వేల కోట్లను విడుదల చేయాలని జనవరి 3న ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. పోలవరానికి అడ్‌హక్‌గా నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర అధికారులతో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీతో రాష్ట్ర అధికారులతో ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కమిటీ మూడుసార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో పోలవరానికి అడ్‌హక్‌గా నిధుల మంజూరుకు కేంద్ర కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఆదేశించింది.
పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.20,702.58 కోట్లను ఖర్చుచేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రూ.4,730.71 కోట్లను వ్యయంచేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక అంటే 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ రూ.15,971.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయచేసింది. అందులో ఇప్పటివరకూ రూ.13,098.57 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,873.30 కోట్లను రీయింబర్స్ చేయాలి.
కేంద్ర జల్‌శక్తి శాఖ సూచనల మేరకు.. రీయింబర్స్ చేయాల్సిన రూ.2,873.30 కోట్లతోపాటు అడ్‌హక్‌గా మార్చివరకూ భూసేకరణ, సహాయ పునరావాసం కల్పనకు రూ.2,286.55 కోట్లు, ప్రాజెక్టు పనులకు రూ.2,118 కోట్లు వెరసి రూ.7,278 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ, పీపీఏ రూ.5,306.32 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సిఫార్సు చేశాయి. ఈ నిధుల విడుదలైతే పోలవరం ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకుంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.