
Vjy, Dec 22: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (low pressure) బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా (Chance of turning into a cyclone) బలపడనుంది. అనంతరం ఆ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం తెలిపింది. దీని ప్రభావం ఏపీ రాష్ట్రంపై నామమాత్రంగానే ఉండనుంది.
మరోవైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో (Andhra Pradesh) పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది.
ఈ నెల 24 నుంచి ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి.