New Delhi, DEC 22: ప్రపంచదేశాల్లో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో భారత్ (India) అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అలర్ట్ (Covid Alert) జారీ చేసింది. నిన్న కేంద్రమంత్రి నేతృత్వంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ (Covid) అత్యున్నత సమావేశం నిర్వహించింది. అయితే దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ కూడా రివ్యూ చేయనున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 (Omicron BF 7) కేసులు భారత్ లో కూడా వెలుగు చూడటంతో అప్రమత్తత ప్రకటించారు. గుజరాత్ లో రెండు కేసులు, ఒడిశాలో ఒకరికి కొత్త వేరియంట్ సోకినట్లు తేలింది. దాంతో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు ప్రధాని మోదీ (PM Narendra Modi). గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటూ, హెల్త్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, కోవిడ్ ఫస్ట్, సెకెండ్ వేవ్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా ప్రికాషన్ డోసు విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేయనున్నారు. అర్హులందరికీ ప్రికాషన్ డోసు (Precaution Dose) వేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.
PM Narendra Modi to review the situation related to #COVID19 and related aspects in the country at a high-level meeting today afternoon. pic.twitter.com/26DBWbvtcy
— ANI (@ANI) December 22, 2022
ఇప్పటికే చైనా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని, కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసును అర్హులైన అందరూ తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని, నిఘాను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.
చైనా, ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశంలో అర్హులైన వారిలో 27-28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకొన్నారని నిపుణులు సూచించారు. బూస్టర్ తీసుకోవడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ప్రజలకు సూచించారు. భయపడాల్సిన పనిలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు తప్పనిసరిగా మాస్కు, ఇతర కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.