IPL Auction 2025 Live

Andhra Pradesh Elections 2024: ఈ దుర్మార్గుడికి ఓటేస్తే అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడు, కావలి ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు

నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు

Chandrababu Naidu (photo/X/TDP)

Kavali, Mar 29: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీయే గెలుపు ఖాయంగా కనిపిస్తోందని అన్నారు. వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గంజాయి లేని ప్రాంతం లేదని.. మళ్లీ ఈ దుర్మార్గుడికి ఓటేస్తే, అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడని ధ్వజమెత్తారు.

ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, ఎన్టీఆర్... టీడీపీని స్థాపించిన గొప్ప రోజు ఇది అని అభివర్ణించారు. ఈ 42 ఏళ్లలో తెలుగువారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశామని చెప్పారు. అనేక విజయాలు సాధించామని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వాల ఏర్పాటుతో ముందుకు పోయామని చంద్రబాబు వివరించారు. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుజాతికి తిరుగులేదని నిరూపించగలిగాం అని తెలిపారు. మాది పేదవాళ్ల పార్టీ, అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం, ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

మొన్ననే వైజాగ్‌లో రూ.25వేల కోట్ల డ్రగ్స్ ఇంపోర్టు చూశామన్నారు. జగన్‌కి ఈ కేసుతో సంబంధం లేకపోతే ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఆయన బాబాయి(వివేకా) హత్యని అడ్డం పెట్టుకుని, కోడికత్తి డ్రామా ఆడి గత ఎన్నికల్లో గెలిచాడా? లేదా? అని ప్రశ్నించారు. పాపం వివేకా కూతురు సునీత న్యాయం చేయమంటే, చేశాడా? అని నిలదీశారు. బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని విరుచుకుపడ్డారు. బాబాయిని ఎవరు హత్యచేశారో చెప్పమని జగన్ చెల్లెలు సునీత అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు.

"కానీ ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ కష్టాలు పడుతున్నారు. అందుకే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజాగళం పేరిట ఇక్కడికి వచ్చాను. ప్రజలు గళం విప్పాలని చెప్పడానికి వచ్చాను. రైతులు పరిస్థితులు బాగున్నాయా? మహిళలకు రక్షణ ఉందా? ఈ దుర్మార్గుడు తన పాలనలో రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడు, మీ రక్తాన్ని జలగ మాదిరిగా తాగేస్తున్నాడు.

Here's Videos

కరెంటు ఛార్జీలు అప్పుడు రూ.200లు ఉంటే, ఇప్పుడు రూ.1000లు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. 5 ఏళ్ల కరెంటు బిల్లుల బాదుడెంతో లెక్కపెట్టాలని అన్నారు. జగన్ ఒక సైకో అని.. రూ.10లు ఇచ్చి రూ.100లు దోచుకున్నాడని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు, పెట్రోలు, నూనె, పప్పులు, చింతపండు, చివరికి ఉప్పు ధరలు కూడా పెరిగాయని... రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని తాకట్టు పెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని మండిపడ్డారు. సంపద సృష్టించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో కలిసి వచ్చారని చంద్రబాబు తెలిపారు.

చిన్నాన్న వివేకాను చంపినోడిని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

ఈ ఎన్నికల్లో వ్యతిరేఖ ఓటు చీలకూడదని మనతో పవన్ కలిశారన్నారు. బీజేపీ కూడా తమతో కలిసి వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికే ఈ పొత్తు అని వివరించారు. తాను రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తే, జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీకి రాజధానిని లేకుండా నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగుళూరుకి వెళ్లడం నామూషీనా? కాదా? అని నిలదీశారు. ఉదయగిరిలో తాగు, సాగునీటి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. సంపద సృష్టించి, నిరంతరం పేదలకు అందేలా చూస్తానని చంద్రబాబు తెలిపారు.

అన్ని ధరలు పెంచేశారు, చెత్త మీద కూడా ఈ చెత్త ముఖ్యమంత్రి పన్ను వేశాడు. ప్రజల ఆదాయం కంటే ఖర్చులు పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఏమైంది? డీఎస్సీ జరుగుతుందా? జాబ్ రావాలంటే బాబు రావాలి. ఈ ఐదేళ్లలో అందరూ నష్టపోయారు. ఆ విషయాన్ని చెప్పడానికి, గుర్తుచేయడానికి ఇక్కడికి వచ్చాను. మీ అభివృద్ధి, మీ సంక్షేమం నా బాధ్యత అని చెప్పడానికి వచ్చాను. ఇచ్ఛాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్ ను ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారు. ఈ ప్రజావ్యతిరేక తుపాను మాదిరిగా వస్తోంది. ఈ తుపాను తాకిడికి ఫ్యాను గిలగిలా కొట్టుకుంటుంది. చివరికి ఫ్యాను డస్ట్ బిన్ లో చేరుకుంటుంది.

45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే. నా జీవితకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి వస్తాడని నేను ఊహించలేదు. జగన్ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, చట్టంపై గౌరవం లేదు, వ్యవస్థలపై విశ్వాసం లేదు. అతడికి తెలిసిందల్లా దోపిడీ, దోచుకున్న డబ్బుతో అక్రమాలు చేయడం, ఆ డబ్బులతో ప్యాలెస్ లు కట్టుకోవడం, మీడియా, వ్యవస్థలను మేనేజ్ చేయడం, పేటీఎం బ్యాచ్ లను మనపై పురికొల్పడం.

జగన్ ను ఎవరూ అడగకూడదు... అతడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు... ఆయన ఏ తప్పు చేసినా మనం భరించాలి. ఎవరైనా ఎదురుతిరిగితే వారిని పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని పనిచేశాడు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ నేతలు.. అందరినీ అణగదొక్కాడు. ఎవరైనా రోడ్డుపైకి వచ్చి పోరాడగలిగారా? ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వస్తారు, ఆ తర్వాత సీబీసీఐడీ వాళ్లు వస్తారు... అరెస్ట్ చేస్తారు... జైల్లో పెడతారు... ఈ పోలీసుల్లో కొంతమంది జైల్లో కొడతారు, టార్చర్ పెడతారు... చంపేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కేసులు పెట్టి వేధించారు. వీళ్ల దాష్టీకాలకు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు.

ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుందని అన్నారు. ఉదయగిరిలో సాగునీరుకి సంబంధించి జగన్ ప్రభుత్వం ఒక చిన్నపని అయినా చేసిందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఎక్కడ చూసినా యువతే కనిపిస్తుందని.. మీ జీవితాలతో జగన్ ఆడుకున్నాడా? లేదా? మెగా డీఎస్సీ ఇచ్చాడా? లేదా అని నిలదీశారు. సీఎం జగన్‌కి కేసులు పెట్టడం, భయపెట్టడం, భయబ్రాంతులకి గురిచేయడమే తెలుసునని అన్నారు. అభివృద్ధి తెలియని చెత్త సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. సమయం లేదు మిత్రమా... మే 13వ తేదీ... మనమందరం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ చేతకాని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇక బాబాయ్ ని చంపారు. బాబాయ్ ది గొడ్డలివేటా, లేక సహజమరణమా? చంపిన వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి మళ్లీ ఊరేగుతున్నారు. ఈయన చెల్లెలు ఇప్పుడు ఎలుగెత్తుతోంది. మా నాన్నను చంపిన వాళ్లపై కేసులు పెట్టండి, ఏం జరిగిందో ప్రపంచానికి తెలియజేయండి, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించండి అని అడిగితే, ఆడబిడ్డపై కేసులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత మీకు రక్షణ ఉందా అని ప్రజలను అడుగుతున్నా. ప్రజల ఆస్తులకు రక్షణ ఉందా? కృష్ణపట్నం పోర్టు ఏమైందో చూశాం.

ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కొత్త వేషం వేసుకుని వచ్చాడు. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేవాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరుగుతున్నాడు. ఆ బస్సు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. అందులోంచి దిగకుండానే మేము సిద్ధం అంటున్నాడు.

నేను పేదల మనిషిని, మిగతా అందరూ పెత్తందార్లు అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఈ ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. పేదల కోసం రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినవాళ్లు పెత్తందార్లా? లేక, అధికార దాహంతో అన్న క్యాంటీన్లను రద్దు చేసినవాళ్లు పెత్లందార్లా?

మన పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా డబ్బులు ఇచ్చాను. మేం పెత్తందారులమా, లేక విదేశీ విద్య పథకం నిలిపివేసినవాళ్లు పెత్తందార్లా? ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని, 12 లక్షల టిడ్కో ఇళ్లు తీసుకువస్తే, ఐదేళ్లుగా టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా రంగులు వేసుకుని పెత్తనం చేసేవాళ్లు మీరు పెత్తందార్లు కాదా? మేం ప్రతి ఇంటికి రూ.3 లక్షలు ఇచ్చాం, కానీ ఇతడు రూ.500 కోట్లతో రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ సందర్భంగా చెబుతున్నా... ఇప్పటివరకు ఇచ్చిన ఇంటి కాలనీలు రద్దు చేయం. ఇంకా డబ్బులు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా సహకరిస్తాను. నేను సైకో జగన్ లాంటి వాడ్ని కాను.

ఎస్సీల కోసం 27 పథకాలు ఇచ్చాం... వాటిని రద్దు చేశాడు. ఆ పథకాలు ఇచ్చిన మేం పెత్తందారులమా? ఆ 27 పథకాలు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడా? పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం... ఇప్పుడీ ఫీజు రీయింబర్స్ మెంట్ తీసేశారు. ఇప్పుడు చెప్పండి... మేం పెత్తందారులమా? ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసిన జగన్ పెత్తందారుడా?

ప్రజలందరి ఆదాయాలు తగ్గిపోతున్నాయి, జగన్ ఆదాయాలు మాత్రమే పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో తలసరి అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది, ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. జగన్ మాత్రం విలాసవంతమైన ఇళ్లు కట్టుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్నాడు. అందుకే ఇవాళ నేను ఒక్కటే కోరుతున్నా... ప్రజలారా సిద్ధం కండి. జగన్... నిన్ను, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధం" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.