Andhra Pradesh Elections 2024: ఏపీలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసేలా ఈసీ కసరత్తు, ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం
సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది.
Vjy, Dec 3: వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 9,10 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం (Election Commission) ఏపీలో పర్యటించనుంది. సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు రానుంది. ఈ పర్యటనలో ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా సిద్ధం కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు, ఫిర్యాదులపై విచారణను అధికారులు పరిశీలన చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను (Andhra Pradesh Elections 2024) కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది. ఇంతకు మునుపే ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించింది. అయితే మరిన్ని పర్యటనలు, సంప్రదింపుల తర్వాతే షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. దేశ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో (AP assembly elections) భాగంగా తొలి దశలోనే ఏపీ ఎన్నికలను ముగించేలా ఎన్నికల సంఘం ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఏపీ పర్యటనలో భాగంగా మద్యం అక్రమ రవాణా, డబ్బు చేరవేత వంటి కార్యకలాపాల నివారణకు చెక్ పోస్ట్ ఏర్పాటు వంటి ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు బృందం వెళ్లనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా భేటీ కానుంది. రాష్ట్ర సీఈఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో కూడా భేటీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో భాగంగా ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు, అలాగే తమిళనాడు లోక్‌సభ స్థానాలకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈసీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జనవరి 7వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్ర పర్యటన ద్వారా లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కసరత్తులు మొదలుపెట్టనుంది. తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకు.. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఉన్న 175 స్థానాలతో పాటు 25 లోక్‌సభ సీట్లకు తొలి దశలోనే ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటోంది.
2019 ఎన్నికల సమయంలో మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమై.. మే 19వ తేదీతో లోక్‌సభ/ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో 2024 ఎన్నికలను కూడా ఆరు లేదంటే ఏడు విడతల్లో నిర్వహించాలని ఈసీ అనుకుంటోందని సమాచారం.