Andhra Pradesh: గోదావరిలో దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య, చిన్నారి మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు, మిగతా డెడ్ బాడీల కోసం గాలింపు, వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్న మృతుడి భార్య చనిపోకముందు రాసిన లేఖ
జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో (Godavari River) దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య (family-commits-suicide) చేసుకున్నారు.
Amaravati, August 1: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో (Godavari River) దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య (family-commits-suicide) చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన భార్యాభర్తలు సతీశ్, సంధ్య, వారి పిల్లలు జశ్విన్(4), బిందుశ్రీ (2)గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విషాద ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద పాప జై శ్రీ దుర్గ బాడీని పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇటీవల గల్ఫ్ నుంచి సతీష్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి ఆచంటలో ఉంటున్న భార్య, పిల్లలకు ఫోన్ చేసి శుక్రవారం రాత్రి చించినాడ బ్రిడ్జి వద్దకు రమ్మన్నాడు.
ఆ తర్వాత సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులు అదృశ్యం కావడంతో యలమంచిలి పోలీస్ స్టేషన్‌లో సతీస్ బంధువులు ఫిర్యాదు చేశారు. బ్రిడ్జి వద్ద సతీష్‌కు చెందిన బైక్‌ను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఆత్మహత్య ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తమ చావుకు కొంతమంది వ్యక్తులు కారణమని పేర్కొంటూ భార్య రాసిన లేఖ వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. దీంతోపాటు ‘డాడీగారండీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నలుగురం ఇప్పుడే చనిపోతున్నాం. నేను స్పాట్‌లో ఉన్నాను. ఆ లేఖ రాసింది నేనే. జీవితం తగలబెట్టేశాడు. అది నేను ఇప్పుడే తెలుసుకున్నాను’ అంటూ ఆ వివాహిత ఆడియో సందేశం కూడా వాట్సప్ గ్రూపుల్లో ప్రచారమవుతోంది.
తనను రోజూ ఓ వ్యక్తి టార్చర్ పెట్టేవాడని, తనకు తెలియకుండానే మాత్రలు ఇచ్చేవాడని, తన డబ్బులు, బంగారం దోచుకున్నాడని ఆమె లేఖలో పేర్కొంది. అది విని తన భర్త తట్టుకోలేకపోయాడని, తన కాపురం నాశనమైందని, ఇదంతా డబ్బు, బంగారం కోసమే ఆ వ్యక్తి చేశాడని తెలిపింది. ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉంటున్న ఆమె భర్త కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడని స్థానికులు చెబుతున్నారు.