Chhatrapur, July 31: ఆన్‌లైన్ మొబైల్ గేమింగ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ రూ.40 వేలు పోగొట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య (13-Year-Old Boy Dies By Suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) ఛత్తర్ పూర్ జిల్లాలోని శాంతినగర్ లో సంభవించింది. యుద్ధానికి సంబంధించిన ఫ్రీ ఫైర్ అనే ఆన్ లైన్ గేమ్ (Online Game Free Fire) ను ఆ చిన్నారి తరచూ ఆడేవాడు. ఈ క్రమంలోనే నిన్న ఇంట్లో సోదరితో కలిసి ఉన్న ఆ బాలుడు.. ఫ్రీ ఫైర్ ఆడాడు.
తన తల్లి ఖాతాలోంచి రూ.1,500ను వాడుకున్నాడు. డబ్బులు డ్రా అయినట్టు ఉద్యోగస్థురాలైన అతడి తల్లికి మెసేజ్ వెళ్లడంతో.. ఆమె వెంటనే కుమారుడికి ఫోన్ చేసింది. తల్లి కోపంతో అడగడంతో కుమారుడు తడబడ్డాడు. మెల్లగా అడగడంతో డబ్బులు ఆన్‌లైన్ గేమ్ కోసం ఆడినట్లు తెలిపాడు. రూ.40 వేలు ఆన్‌లైన్ గేమ్‌తో వృథా చేశాడని తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో కుమారుడు మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తల్లి మందలించిందనే కోపంతో ఇంటికొచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉన్న సోదరి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు కుమారుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.‘సారీ అమ్మా..’ అని చెబుతూ తాను మొత్తం రూ.40 వేలు ఖాతా నుంచి తీసినట్టు ఓ లేఖ రాసి చనిపోయాడు.
బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకుని దర్యాప్తు చేసిన పోలీసులుకు అతడి గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో వారికి మరిన్ని వాస్తవాలు తెలిశాయి. తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి అంతకుముందు రూ.40 వేలు నగదు తీసి ఆన్‌లైన్‌లో మొబైల్ గేమ్ ఆడేందుకు వినియోగించినట్టు బాలుడు ఆ లేఖలో రాసినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం చేసిన అనంతరం బాలుడి మృత దేహాన్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ గేమ్‌లో బాలుడు తనకు తానుగా డబ్బు పెట్టాడా.. లేదా సొమ్ము కోసం ఎవరైనా అతడిని బెదిరించారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.