Andhra Pradesh Floods: ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.

AP Rains (photo-Video Grab)

Vizag, July 27: తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా లావేరులో అత్యధికంగా 218.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా తామాడలో అత్యధికంగా 21.8 సెం.మీ వర్షపాతం కురిసింది. రాష్ట్రంలో 90 చోట్ల 50 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది.

గురువారం కూడా కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రంలో పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వానలతో కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కల్వర్టులను ముంచేసి నీరు ప్రవహించింది. అక్కడక్కడ నారుమళ్లు, కొన్నిచోట్ల వరి పొలాలు నీటిలో మునిగాయి. విశాఖ బీచ్‌ రోడ్డు జలమయమైంది. రైల్వే కాలనీ, జ్ఞానాపురంలో పెద్దఎత్తున వరద చేరడంతో అటు ప్రయాణించే వాహనాలు మునిగాయి.

అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన వరద, 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన మోరంచపల్లి గ్రామం, రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్

గోదావరి మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణానదిలోనూ ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. ఏలూరు నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. నగరంలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ముంపునకు గురైంది. ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు పొంగాయి. బయ్యేరు ఉధృతంగా ప్రవహించింది. ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. తమ్మిలేరు వరద ఉధృతి కారణంగా బలివే-విజయరాయిని కలుపుతూ వేసిన తాత్కాలిక రహదారికి గండి పడింది.

ముదినేపల్లి-గుడ్లవల్లేరు మధ్య ఉన్న రహదారి జలమయమైంది. గుండేరు వాగు ఉధృతికి కామవరపుకోట మండలంలోని కళ్ళచెరువు, లింగపాలెం మండలంలోని ఆసన్నగూడెం గ్రామాలను కలిపే తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించటంతో జిల్లాలోని విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద తూర్పు, పడమటి కాలువలు ఉధృతంగా పొంగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బీ అలర్ట్! ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన

జంగారెడ్డిగూడెం మండలం పట్టెంపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా పొంగటంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం స్పిల్‌వే వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి బుధవారం సాయంత్రం 8,50,589 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లా కలెక్టరేట్‌, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలోను కుక్కునూరు, వేలేరుపాడు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులకు రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచింది. పిడుగుపాటుకు అల్లూరి జిల్లా అరకులోలోయ మండలంలో ఒకరు చనిపోయారు.ఇక్కడితోపాటు తెలంగాణలోనూ భారీగా కురుస్తున్న వానలతో గోదావరి, కృష్ణా నదులకు వరద ప్రవాహం పెరిగింది.వేగంగా పెరుగుదల నమోదవుతున్నందున త్వరలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. గురువారం మధ్యాహ్నానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయానికి 29,758 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాల నుంచి 29,641, హంద్రీనది నుంచి 117 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం బుధవారం రాత్రి 9 గంటల సమయానికి 815.50 అడుగులు, నీటినిల్వ 37.6570 టీఎంసీలుగా నమోదైంది.

విశాఖ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వేస్టేషన్‌ సమీపంలోని చావులమదుం బ్రిడ్జి వద్ద వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. పాడేరులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోనసీమలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ప్రకాశం బ్యారేజ్‌కు వరద పెరుగుతోంది. మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 71వేల క్యూసెక్యులుగా ఉంది. 40 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద 12.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.