Moranchapalli village in Bhupalapalli mandal of Jayashankar district remained under water blockade

Hyd, July 27: తెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోరంచపల్లి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లు, భవనాలు మునిగిపోవడంతో మేడలపైకి వెళ్లి.. వర్షాల్లో తడుస్తూ మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ.. సెల్ఫీవీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. మోరంచ వాగు ఉప్పొంగడంతో సమీపంలోని ఇళ్లలోకి 4 నుంచి 5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇంటి స్లాబ్‌ల పైకి ఎక్కారు.

బీ అలర్ట్! ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన

కొంతమంది నిత్యావసర వస్తువులు కూడా తీసుకెళ్లి స్లాబ్‌లపై కూర్చున్నారు. మరికొంతమంది సమీపంలోని చెట్లపైన తలదాచుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షానికి మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి - పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కట్టలు తెంచుకుని ఊరిపై పడిన వాగు.. అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తింది. మోరంచపల్లి గ్రామంలో సుమారు 1000 మంది జనాభా ఉంటారని అంచనా. అందరూ జలదిగ్భంధంలో చిక్కుకుపోయారు.

Here's Video

ఎలాగైనా ఊరినుంచి బయటపడదామంటే..6 ఫీట్లకు పైగానే వరద నీరు ప్రవహిస్తుందని, వాగు ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి పరకాల జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రెండు లారీలు వరదనీటిలో చిక్కుకుపోగా.. లారీ డ్రైవర్లు క్యాబిన్ల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ఉద్ధృతిలో ముగ్గురు కొట్టుకుపోయినట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు.

పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అప్రమత్తం చేశారు. పోలీసులు, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రదేశానికి చేర్చేందుకు చర్యలు చేపట్టారు.హెలికాఫ్టర్, బోట్ల ద్వారా గ్రామప్రజలను రక్షించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వరద ప్రవాహంలో చిక్కుకున్న మొరంచపల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.స్థానిక పరిస్థితులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.