Mekatoti Sucharita: నేను రాజీనామా చేశానంటూ కథలు అల్లారు, రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేసిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె (Former home minister Sucharitha) సీఎం జగన్‌తో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు.
Amaravati, April 13: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అలకబూనిన రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత (Mekatoti Sucharita) కాసేపటి క్రితం మౌనం వీడారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె (Former home minister Sucharitha) సీఎం జగన్‌తో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంటూ జరిగిన ప్రచారంపై ఆమె స్పందించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో (Cabinet reshuffle) పదవిని ఆశించిన నేపథ్యంలో పదవి దక్కకపోవడంతో చిన్నపాటి ఎమోషన్‌కు గురైన మాట వాస్తవమేనని ఆమె చెప్పారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ లెటర్ రాశానని, దానినే తన కుమార్తె తప్పుగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా చెప్పిందని పేర్కొన్నారు. రాజీనామా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే.. వైసీపీ కార్యకర్తగానే కొనసాగుతానని సుచరిత చెప్పుకొచ్చారు. తనను సీఎం జగన్ (AP CM YS JAgan) తన కుటుంబంలోని వ్యక్తిగా పరిగణిస్తారని ఆమె చెప్పారు. జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని కూడా సుచరిత చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యం నేపథ్యంలో బయటకు రాలేకపోయానని కూడా ఆమె చెప్పారు.
తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్‌లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.