Reverse Tendering In Housing Projects: జగన్ సర్కారు మరో సంచలనం, ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మరోసారి రూ.105.91 కోట్లు ఆదా, ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్‌ యూనిట్లకు దశలవారీగా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ (Reverse Tendering In Homes) ద్వారా జగన్ సర్కారు మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది.

Andhra Pradesh Government To Saves Rs 105.91Crores from Reverse Tendering In Homes (photo-Twitter)

Amaravathi, November 29: పోలవరం రివర్స్ టెండరింగ్ (Polavaram Reverse Tendering) ద్వారా డబ్బును ఆదా చేసిన ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) తాజాగా మరో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ .105.91 కోట్లను ఆదాచేసింది. ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ (Reverse Tendering In Homes) ద్వారా జగన్ సర్కారు మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఎపి టిడ్కో (ఎపి టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మొదటి దశలో 14,368 హౌసింగ్ యూనిట్ల రివర్స్ బిడ్డింగ్ ద్వారా మొత్తం రూ .105.91 కోట్లను ఆదాచేసింది.

కాగా రివర్స్ టెండర్లను గురువారం ఖరారు చేశారు. టీడీపీ (TDP) హయాంలో పట్టణాలకు హౌసింగ్ స్కీమ్ ’అందరికీ ఇళ్ల పథకం’ కింద 65,969 హౌసింగ్ యూనిట్లతో ప్రాజెక్టులను ఏపీటిడ్కో చేపట్టింది. ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరలకు టెండర్లను ఖరారు చేసింది.

అయితే వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తరువాత, రివర్స్ టెండర్ ప్రక్రియతో ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది. ఈ క్రమంలో ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్‌ యూనిట్లకు దశలవారీగా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ (AP CM YS Jagan) ఆదేశించారు. ప్రధాన టెండర్లు పిలిచిన మర్నాడే రివర్స్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు.

అందులో భాగంగా ఏపీ టిడ్కో మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 14,368 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపట్టింది. తద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లాలో 5,808 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి దాఖలు చేసిన టెండర్లలో డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.271.03 కోట్ల విలువైన పనులకు 15 శాతం తక్కువకు అంటే రూ.2309.18 కోట్లకే ఆ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. చదరపు అడుగు రూ.1,321 చొప్పున టెండరు ఖరారు చేశారు. తద్వారా రూ.40.85 కోట్లు ఆదా అయ్యాయి.

కృష్ణా జిల్లా

అలాగే కృష్ణా జిల్లాలో 2,064 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి దాఖలు చేసిన టెండర్లలో ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.95.65 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.81.30 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. తద్వారా ఖజానాకు రూ.14.35 కోట్లు ఆదా అయ్యాయి. చదరపు అడుగు రూ.1,312 చొప్పున టెండరు ఖరారు చేశారు.

విశాఖ జిల్లా

విశాఖ జిల్లాలో మొత్తం 3,424 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి దాఖలైన టెండర్లలో ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.192.23 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.163.40 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. తద్వారా రూ.28.83 కోట్ల ప్రజాధానం ఆదా అయ్యింది.

విజయనగరం జిల్లా

ఇటు విజయనగరం జిల్లాలో మొత్తం 3,072 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి రివర్స్ టెండర్ నిర్వహించగా.. ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. ఆ సంస్థ రూ.148.12 కోట్ల విలువైన పనులకు 14.78 శాతం తక్కువకు అంటే రూ.126.24 కోట్లకు బీడ్ దాఖలు చేసింది. తద్వారా ఖజానాకు రూ.21.88 కోట్లు ఆదా అయ్యాయి. ఈ సంస్థకు చదరపు అడుగు రూ.1,315 చొప్పున టెండరు ఖరారు చేశారు.