Andhra Pradesh: 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత వ్యాక్సిన్; కేసులు పెరుగుతున్న దృష్ట్యా శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధింపు

మే 1 నుంచి ప్రారంభం కాబోయే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఏపీలో ఉచితంగా టీకా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా....

AP CM YS Jagan | (File Photo)

Amaravathi, April 23: కోవిడ్ టీకాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రారంభం కాబోయే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఏపీలో ఉచితంగా టీకా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నిర్ణయించారు. వ్యాక్సిన్ సరఫరా విషయమై భారత్ బయోటెక్, హెటిరో డ్రగ్స్ యాజమాన్యాలతో  సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వారు సుమారు 2 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. సీఎం నిర్ణయంతో వారందరికీ లబ్ది చేకూరే అవకాశం ఉంది.

Here's the update:

అంతేకాకుండా రాష్ట్రంలో వేగంగా కేసులు పెరుగుతున్నందున శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే ప్రస్తుతం చేస్తున్న కరోనా నిర్దారణ పరీక్షల సామర్ధ్యాన్ని కూడా రోజుకి 40 వేల నుంచి 60 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షల కోసం చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మంత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయనకు జ్వరంతో పాటు తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నాయి. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.