HC Stay on Construction of House Amravati: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై స్టే విధించిన హైకోర్టు

రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Credits: Wikimedia Commons

Vjy, August 3: రాజధానిలో సామాన్యులకు ఇళ్లను నిర్మించాలనే జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నిర్మాణ పనులపై స్టే విధిస్తూ త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. జగనన్న కాలనీల పేరుతో రాజధానేతర ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాలను అందజేసింది.

ఏపీలో ఎన్నికల కోలాహలం షురూ, రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల, 175 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వీళ్లే!

ఇందుకోసం రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాలను కేటాయించి, 50,793 మందికి ఇళ్ల నిర్మాణ పత్రాలను మంజూరు చేసింది. అయితే, అమరావతిలోని ఆర్-5 జోన్ ఎలక్ట్రానిక్ సిటీ అని, పేదలకు ఇళ్ల స్థలాలను మరోచోట ఇవ్వాలని రాజధాని రైతులు కోర్టుకెక్కారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, సీఆర్డీఏ ఒప్పందానికి విరుద్దమని కోర్టుకు తెలిపారు.

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే.