AP High Court New Judges: ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు, ఇప్పుడు మొత్తం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19, న్యాయవాదుల కోటా నుంచి నలుగురు నియామకం
వీరి నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది.
Amaravathi, Janury 11: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్ర హైకోర్టు ( high court) న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది.
న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court collegium) గతేడాది జూలై 25న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నలుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారం ప్రమాణం చేయించనున్నారు.
రావు రఘనందనరావు (Raghunandan Rao)
హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన రావు రఘనందనరావు ఈయన 1964 జూన్ 30న రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించారు. పాఠశాల విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు రఘునందన్‌రావుకు సీనియర్ న్యాయవాది హోదానిచ్చి గౌరవించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
బట్టు దేవానంద్ ( Battu Devanand)
1966 ఏప్రిల్ 14న కృష్ణా జిల్లా, గుడివాడ చౌదరిపేటలో వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ, ఏఎన్‌ఆర్ కాలేజీలో ఇంటర్, బీఏ, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదివారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1993 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2004 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీలకు సైతం న్యాయవాదిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.
నైనాల జయసూర్య (Ninala Jayasurya)
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1968లో జన్మించారు. తల్లిదండ్రులు.. ఎన్‌వీవీ కృష్ణారావు, ఇందిరా దేవి. తండ్రి.. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.1992లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తలారి అనంతబాబు వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003-04లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. 2009-14 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.
దొనడి రమేశ్(Donadi Ramesh)
1965 జూన్ 27న చిత్తూరు జిల్లా సోమల మండలం కామనపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు.. డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2000-2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006-13 మధ్య కాలంలో హైకోర్టులో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షాఅభియాన్‌కు న్యాయవాదిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు.