R Krishnaiah: కోట్లు ఖర్చు పెట్టలేని నన్ను రాజ్యసభకు పంపిస్తున్నారు, బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమకు ఇదే నిదర్శనమన్న బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య
ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య (National BC Welfare Association President R Krishnaiah) స్పందించారు. బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్ కృష్ణయ్య.
Amaravati, May 17: రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య (National BC Welfare Association President R Krishnaiah) స్పందించారు. బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్ కృష్ణయ్య. మొదట్నుంచీ సీఎం జగన్.. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూనే ఉన్నారు. అన్నట్టుగానే బీసీలకి అధిక ప్రాదాన్యత ఇస్తూ వస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితి వైఎస్సార్‌సీపీలో ఉండదన్న కృష్ణయ్య.. అదే ఉంటే తనలాంటోడు రాజ్యసభకు వెళ్తాడా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీలోనే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతోందని, సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆర్ కృష్ణయ్య (R Krishnaiah Thanks to AP CM YS Jagan ) తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకుగానూ ఆర్ కృష్ణయ్య.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు పంపుతున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ణతలు తెలియజేసేందుకు వచ్చానని అన్నారు. దశాబ్దాలుగా బీసీ ,ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం తాను పోరాడుతున్నానని, ఆ అంకిత భావాన్ని గుర్తించి సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారని, బీసీలకు సీఎం జగన్ ఇస్తోన్న ప్రాధాన్యతను చూసి దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. తన సేవలను వైస్సార్‌సీపీలో ఉన్న నేతలంతా మనస్పూర్తిగా అంగీకరిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా.. తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లేనని, అలాగే బీసీల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ కృష్ణయ్య.. పూర్తి పేరు ర్యాగ కృష్ణయ్య. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమ నేతగా ఎదిగారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు.
1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు.