వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు (Pic Source : Twitter)

అమరావతి: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా పెద్దల సభకు పంపుతున్న వారిలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు ఉండటం విశేషం. అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే..

నిరంజన్‌ రెడ్డి 

>> సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు.

>> జులై 22 1970 అదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది.

>> హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి.

>> ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్‌. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.

>> రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్‌ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు.

>> ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా.

ఆర్‌ కృష్ణయ్య

>> ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత.

>> సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు.

>> ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్‌ఎల్‌ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా.

>> విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.

>> నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్‌.కృష్ణయ్యకు గుర్తింపు.

>> ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్‌ కృష్ణయ్య.

>> నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ కోసం సైతం పోరాటాలు చేశారు.

>> 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

>> క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

>> 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బీద మస్తాన్‌ రావు

>> ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్‌సీపీ నేత బీద మస్తాన్‌రావు.

>> జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జననం.

>> విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్‌). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది.

>> చెన్నైలో ఓ ప్రముఖ హోటల్‌ గ్రూప్‌నకు ఫైనాన్షియల్‌ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

>> బోగోల్‌ మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు.

>> బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు.

>> 2019లో నెల్లూరు లోక్‌ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు.

>> రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు.

విజయసాయి రెడ్డి

>> వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి.

>> 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం.

>> చెన్నైలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు.

>> రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

>> వైఎస్సార్‌సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు.

>> రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్‌, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ పని చేశారు.