Perni Nani on Pawan Kalyan: కులాలపై కనీస అవగాహన లేని సన్నాసి పవన్, మరో ఏడాదిలో అన్ని రంగులు బయటపడతాయని పేర్ని నాని విమర్శలు
కాపులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో చేశారని, అందుకే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు.
Amaravati, Mar 13: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మాజీ మంత్రి పేర్నినాని మరోసారి విరుచుకుపడ్డారు. కాపులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్మారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో చేశారని, అందుకే ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. తన కులంవాళ్లు ఓటేస్తే నేను ఓడిపోయేవాడినే కాదని పవన్ అంటున్నాడు.. అసలు రాజకీయ నేతకు, ప్రజా నాయకుడికి ఏ కులం అయితే ఏంటని ప్రశ్నించారు.
ఒక్క కుల ఓట్లు వేస్తే చట్టసభలకు వెళ్లాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో కుల నేత అవుతారు.. ప్రజా నేత కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్ కల్యాణ్ అంతిమ లక్క్ష్యమని పేర్ని నాని విమర్శించారు. పవన్ ఏం చేశాడని ఆయన్ని ప్రజలు నమ్మాలని ప్రశ్నించారు. కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశాడు.
సినిమాకి వంద రోజుల ఫంక్షన్ చేసినట్లు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారని మాజీ మంత్రి దుయ్యబట్టారు. కులాలపైన పవన్‌కు కనీస అవగాహన లేదని.. రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే.. ఏటా పవన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పవన్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మరో ఏడాదిలో జనసేన అధినేత అన్ని రంగులు బయటపడతాయని అన్నారు.
‘కాపులు ఓటేస్తే ఓడిపోయానని పవన్ అంటున్నాడు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని అంటున్నాడు. 2012 నుంచి ఇప్పటి వరకు నీ చరిత్ర ఏంటి? లోపాయికారీ ఒప్పందాలు కావా? 2014 నుంచి చంద్రబాబుకు ఊడిగం చేస్తుంది ఎవరూ? 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టి.. ఎన్నికలు పూర్తవగానే బీజేపీతో జత కలిసింది లోపాయి కారీ ఒప్పందం కాదా?
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు
లోపాయికారీ ఒప్పందాలకు పవన్ స్పెషలిస్ట్. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్ పోటీపడుతున్నాడు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్ తప్పుడు ప్రకటనలు. పవన్ మాటలను నమ్మే స్థితిలోప్రజలు లేరు. ఓట్లు చీల్చాలనే లక్క్ష్యంతో పోటీ చేయించింది చంద్రబాబు కాదా?. చంద్రబాబు పప్రాపకం కోసం ప్రభుత్వంపై పవన్ విషం చిమ్ముతున్నాడు’ అని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు.