Andhra Pradesh Rains: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలకు ఉత్తరాంధ్ర విలవిల, స్కూళ్లకు సెలవులు, ఏజెన్సీ గ్రామాలతో తెగిపోయిన సంబంధాలు

దీని ధాటికి ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

Rain in Andhra Pradesh (photo-Video Grab)

Visakha, July 18: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ధాటికి ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డు, రామకృష్ణా థియేటర్‌ రోడ్డు, వెలమ వీధి, పూర్ణా మార్కెట్‌ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా సూచించారు.  వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ సూచించారు.  భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో

భారీ వరదలకు జ్ఞానాపురం పాతవంతెన వద్ద వరదనీరు నిలిచిపోయింది. విశాఖ ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుంచి బిర్లా వరకు సర్వీసు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. కార్యాలయాలు, పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ల లోతు నీటిలో వాహనాలు నడుపుతూ అవస్థలు పడ్డారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

Here's Videos

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అర్ధరాత్రి సమయంలో అధికారులతో సమీక్షించారు. ఏలూరు కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, పశుసంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. పంటనష్టం నివారించాలని చెప్పారు.

ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు మంత్రి అనిత శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం తిరుమల వెళ్లారు. అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి బయల్దేరారు.

Here's Video

రాష్ట్రంలో పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఏలూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో 277 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది. జిల్లాలోని మన్యం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జల్లేరు, బైనేరు వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7 వేల ఎకరాల్లోని పొలాలు నీటమునిగాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పలు ప్రాంతాలలో పొంగిన కొండ వాగుల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ మండలాల్లో కొండవాగుల ఉధృతికి ప్రజా రవాణా నిలిచిపోయింది. దోరమామిడి వద్ద అలివేరు డ్యాం వద్ద నుంచి దిగువకు కొనసాగుతున్న వరద నీరు పారుతోంది. పట్టెన్న పాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి పలు కాలువల ద్వారా జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారి గూడెం ఎర్ర కాలువ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది.

ప్రాజెక్టు నుంచి దిగువకు కొనసాగుతున్న వరద కారణంగా జంగారెడ్డిగూడెం మండలం పలు ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి కొండవాగులు దాటే ప్రయత్నం చేయవద్దు అని అధికారులు సూచనలు చేశారు. పాత ఇళ్లలో నివసించేవారు, కరెంట్ వైర్లు తెగి పడిన చోట, పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వేలేరుపాడు మండలంలో 26.9 సెమీ, బుట్టాయగూడెంలో 26.8 సెమీ వర్షం నమోదైంది. పది మండలాల్లో 10 సెమీ కి పైగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించనున్నారు. జంగారెడ్డిగూడెం ఎర్రకాల్వ జలాశయం నాలుగు గేట్లు ద్వారా నీటిని విడుదల చేశారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పంగిడిగూడెం రోడ్డుతో పాటు పంట పొలాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయడం జరిగింది.

కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు-వరరామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ, పరదానిపుట్టు వద్ద మత్స్యగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగాయి. ముంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్‌వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.

ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానాపురం పాత వంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్‌అండ్‌బీ నుంచి బిర్లా వరకు సర్వీసు రోడ్డుపై వరద నీరు నిలిచింది. అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించాచరు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది.

రైవాడ, కొనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సర్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిని స్థానికులు కాపాడారు. ఆంధ్రా-తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల మేర గండి పడింది. ఈ ప్రభావం ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలపై పడింది. ఇప్పటికే వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, అల్లూరినగర్, రాళ్లపూడి తదితర గ్రామాల్లో కొన్ని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. గండి కారణంగా వరద ఉద్ధృతి మరింత పెరిగి కొన్ని గ్రామాలు నామరూపాల్లేకుండా పోతాయన్న ఆందోళన నెలకొంది.

తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో సుమారు 7,400 ఎకరాలు మునిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కోనసీమ జిల్లాలో 5,500 ఎకరాలకు సరిపడా వేసిన నారుమడులు మునిగిపోయాయి. రాజమహేంద్రవరంలో కొన్ని ప్రాంతాలు సాయంత్రం వరకు ముంపులో ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు ప్రశాంతి, మహేశ్‌కుమార్‌ అధికారులతో సమీక్షించారు.

గోదావరిలో వరద పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడిచిపెడుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక గోదావరి వరదరేవులోకి గురువారం వశిష్ఠ గోదావరి నుంచి వరద చేరింది. ఫలితంగా ఇక్కడి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. బూరుగులంక రేవుకు అవతల ఉన్న ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

తుంగభద్రకు వరద ఉద్ధృతి పెరిగింది. బుధవారం సుమారు 80 వేల క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో గురువారం సాయంత్రానికి 1.12 లక్షలకు చేరింది. ఫలితంగా ఒకేరోజులో జలాశయంలో ఏడు టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగింది. శివమొగ్గలోని తుంగ జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహం తుంగభద్రను చేరుకుంటోంది. భద్రావతిలోని భద్ర జలాశయమూ ఏ క్షణంలోనైనా నిండనుంది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు