Andhra Pradesh Rains: లంక గ్రామాలకు అలర్ట్, కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద, రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువ నుంచి 9.18లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం.. ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి 7గంటల సమయానికి 9లక్షల క్యూసెక్కులు దాటింది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి
Vjy, Sep 1: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం జగదల్‌పూర్‌కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కి.మీ దూరంలో ఉందని పేర్కొన్నారు. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా- విదర్భ చేరుకుని బలహీనపడుతుందని తెలిపారు.దీని ప్రభావంతో సోమవారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, ఈరోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అమరావతిలో 26 సెంమీ, తిరువూరులో 25, గుంటూరులో 23, తెనాలిలో 18, మంగళగిరిలో 17, విజయవాడలో 17.5 సెం.మీ చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వివరించారు.గుంటూరు బస్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. బస్టాండ్ ఆవరణ చెరువును తలపిస్తోంది. పార్క్ చేసిన బస్సులన్నీ నీటమునిగాయి. తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు
ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి 9.18లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం.. ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి 7గంటల సమయానికి 9లక్షల క్యూసెక్కులు దాటింది. ఇంత రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు
ఈ రోజు రాత్రికి 9.30లక్షల వరకు దిగువకు నీరు విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 9.18 లక్షల క్యూసెక్కులు, కాలువల ద్వారా 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునగడంతో కాలువలకు తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా ఉన్న వాగుల నుంచి కృష్ణానదికి వరదనీరు వచ్చి చేరుతోంది.
వరద తీవ్రత పెరగడంతో కృష్ణా నది లంక గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. పులిగడ్డ, దక్షిణ చిరువోల్లంక, కె.కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక తదితర గ్రామాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.