Andhra Pradesh: గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నమోదు కాని కరోనావైరస్ కేసులు, గత 12 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 0, రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న అధికారులు

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. అయితే ఇందులో 9 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.....

Coronavirus in AP (Photo Credits: IANS)

Amaravathi, April 9: గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్-19  కేసులు ప్రజలను, ప్రభుత్వాన్ని కొంత ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈరోజు వచ్చిన రిపోర్ట్స్ కొంత ఊరట కలిగించాయి. రాష్ట్రంలో గురువారం ఉదయం నాటికి ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 12 గంటల వ్యవధిలో కరోనావైరస్ పాజిటివ్ (COVID-19) కేసుల సంఖ్య '0' గా నమోదైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 217 మంది నమూనాలను పరీక్షలకు పంపగా నిర్వహించగా అన్నింటి రిపోర్ట్స్ నెగెటివ్ గా వచ్చాయని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే సాయంత్రం వరకు 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. అయితే ఇందులో 9 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ప్రధానంగా కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 60 శాతం ఈ జిల్లాల నుంచే ఉన్నాయి. ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు రిపోర్ట్ కాలేదు. భారతదేశంలో 5,734కు చేరిన కోవిడ్-19 కేసులు, మహారాష్ట్రలోనే తీవ్రత అధికం

COVID-19 Current Status in AP:

Andhra Pradesh COVID-19 Update for 09/04/2020

ఇక ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో 90 శాతం మంది దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనానికి వెళ్లి వచ్చిన వారివేనని అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలో కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని, వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఏపీ నుంచి దిల్లీ వెళ్లొచ్చిన 1000 మందిని గుర్తించడంతో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించాము, మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 7,155 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 348 మందికి పాజిటివ్ నిర్థారణ అయిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తట్టి ఆరోగ్య సర్వే చేస్తున్నామని , ఇప్పటికే కోటి 42 లక్షల కుటుంబాలకు ఈ సర్వే పూర్తయింది. అందులో 6, 289 మందికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించాం. వారిలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉన్న 1750 మంది స్వీయ నిర్బంధంలో ఉంచామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రోజుకు వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.