AP's COVID19 Report: వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు, వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్; ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,125 కోవిడ్ కేసులు నమోదు, 1107 మంది రికవరీ
ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు...
Vijayawada, September 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యం కోసం ప్రజలెవరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదని సూచించారు. హెల్త్‌హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఏపిలో ఇప్పటివరకు 3 కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయగా, ఇందులో 2.41 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయని, సింగిల్ డోసు వ్యాక్సిన్ 1.33 కోట్ల మందికి చేరిందని అధికారులు సీఎంకు వివరించారు.
ఇక, ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,568 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,125 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,31,974కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,29,079గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో చిత్తూరు నుంచి 210, నెల్లూరు నుంచి 184 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 9 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 14,019కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,356 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 20,03,543 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,412 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.