AP Covid Report: ఏపీలో తాజాగా 11,434 మందికి కరోనా, 64 మంది మృతి, కరోనా పరిస్థితులపై రేపు మంత్రుల కమిటీ సమావేశం, వివరాలను వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
అదే సమయంలో 7,055 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 64 మంది (Covid Deaths) మరణించారు.
Amaravati, April 27: ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74,435 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,434 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (AP Covid Report) అయింది. గుంటూరు జిల్లాలో 2,028 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1982, నెల్లూరు జిల్లాలో 1237, శ్రీకాకుళం జిల్లాలో 1322, విశాఖ జిల్లాలో 1067 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 7,055 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 64 మంది (Covid Deaths) మరణించారు.
అత్యధికంగా విజయనగరం జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇప్పటిదాకా 10,54,875 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,47,629 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 99,446 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,800కి చేరింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Health Minister Alla Nani) వెల్లడించారు. ఈ కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కారు ఐదుగురు మంత్రులతో ఇటీవలే కమిటీ వేసింది. ఆళ్ల నాని కన్వీనర్ కాగా... బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులు.
తాజాగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, రేపటి సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్ డెసివిర్ అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా, మంత్రుల కమిటీ గత నెలలోనూ సమావేశమై కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టింది.