CBI to Probe Antarvedi Incident: అంతర్వేది రథం దగ్ధం ఘటన సిబిఐకి అప్పగింత, జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ ఘటనను సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారని సీఎంఓ ప్రకటన
సెక్షన్ 6, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది...
Amaravati, September 11: తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని దివ్య రథం దహనమైన సంఘటనపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. సీఎం జగన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
"ఆలయానికి చెందిన రథం దగ్ధం అయిన విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు, దీనికి సంబంధించిన సమగ్ర దర్యాప్తును రాష్ట్ర పోలీసులు ఉన్నతంగా చేస్తున్నప్పటికీ కొన్ని రాజకీయ, సామాజిక వర్గాలు అర్థం లేని విమర్శలు చేశాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు రాష్ట్ర ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న డిమాండ్ల మేరకు మరియు పారదర్శకత కోసం, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర డిజిపిని సీఎం ఆదేశించారు". అని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఘటన దర్యాప్తును సిబిఐకి అప్పజెప్తున్నట్లు శుక్రవారం జీవో విడుదల చేసింది. సెక్షన్ 6, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. దీని ప్రకారం రాష్ట్ర డిజిపి నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
దీని వెనక ఎవరున్నారు? నిజానిజాలు నిగ్గుదేల్చేందుకే రథం దగ్ధమైన ఘటన విచారణను సీబీఐకి అప్పజెప్తున్నామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత వెల్లడించారు.
అంతర్వేది ఆలయానికి చెందిన 40 అడుగుల ఎత్తైన దివ్య రథం 60 ఏళ్ల కిందట పటిష్ఠమైన టేకు కర్రతో చేయించబడింది. స్వామివారి కళ్యాణోత్సవాలకు మరియు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఊరేగింపుల కోసం ఈ రథాన్ని ఉపయోగించేవారు. ఇలాంటి రథం మొన్న ఆదివారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలోనే అగ్నికి ఆహుతైంది. దీంతో ఈ వ్యవహారం సామాజికంగానే కాకుండా రాజకీయంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది ఆలయ కార్యనిర్వాహక అధికారిని సస్పెండ్ చేసింది మరియు ఎండోమెంట్స్ అదనపు కమిషనర్ నేతృత్వంలో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.