Heat Wave in AP: ఏపీ ప్రజలకు వడగాలుల హెచ్చరిక, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు
ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది.
Amaravati, Mar 15: ఏపీలో రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత చాలా అధికంగా ఉండబోతోంది. ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది.
మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో సంస్థ ఎండీ అంబేడ్కర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.2020వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో వడగాడ్పుల మరణాలు లేవని.. ఈ ఏడాది కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
వడగాడ్పుల తీవ్రత ఆధారంగా పాఠశాలల సమయాలను మార్చాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విభాగాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.