Tirumala: షాంపు పొట్లాలు కూడా బంద్, తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం, ప్లాస్టిక్ వస్తువులు కనిపించిన దుకాణాలను సీజ్ చేస్తామని స్పష్టం చేసిన టీటీడీ

కొండపై ఉన్న దుకాణదారులతో పాటు కొండపైకి వచ్చే భక్తులు సైతం నిషేధాన్ని తూ.చ తప్పకుండా పాటించాలని టీటీడీ నిర్ణయించింది.

File image of Tirupati Balaji Temple | (Photo Credits: PTI)

Tirupati, June 1: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇవాళ నుంచి సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం (Complete plastic ban in Tirumala) ప్రారంభమైంది. కొండపై ఉన్న దుకాణదారులతో పాటు కొండపైకి వచ్చే భక్తులు సైతం నిషేధాన్ని తూ.చ తప్పకుండా పాటించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్బంగా తిరుమల ఆస్థానమండపంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులతో భేటీ అయిన అధికారులు ఈ నిర్ణయం (Complete plastic ban) తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేస్తామని ముందస్తుగా సమాచారం అందించిన అధికారులు నిషేధాన్ని ఇవాళ నుంచి అమలును ప్రారంభించారు.

హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్ బిన్లలో ఉంచాలని, తద్వారా సేకరణకు అనువుగా ఉంటుందని అధికారులు అదేశాలు జారీ చేశారు. దుకాణాల్లో అనుమతించిన వస్తువులనే విక్రయించాలని , దుకాణదారులు ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాస్ క్లీనింగ్ చేపట్టాలని అధికారులు వివరించారు. జూన్ 1 నుంచి విజిలెన్స్, హెల్త్, ఎస్టేట్ అధికారులు నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు.

ఆర్టీసీలో టికెట్ పొందడం మరింత ఈజీ, ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు

ప్లాస్టిక్ వస్తువులు కనిపించిన దుకాణాలను సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని నిషేధించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్ కవర్లు గాని ఉపయోగించాలని అధికారులు దుకాణదారులకు సూచించారు. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు కూడా విక్రయించరాదని హెచ్చరించింది.

ఇక డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం జూన్ 3 న తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్యక్రమం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి.ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వివరించారు. ఇందుకు భక్తులు 0877-2263261 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను వివరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి చాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వెల్లడించారు.