PM Modi Vizag Tour Schedule: ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఇదే, రాత్రి ఏడు గంటలకు విశాఖకు చేరుకోనున్న భారత ప్రధాని, స్వాగతం పలకనున్న సీఎం జగన్, భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రధాని శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖకు (Visakhapatnam) చేరుకుంటారు. దానికి రెండు గంటల ముందే సీఎం జగన్ (CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు వస్తారు.
Vizag, Nov 11: భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు (PM Modi Vizag Tour Schedule) రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖకు (Visakhapatnam) చేరుకుంటారు. దానికి రెండు గంటల ముందే సీఎం జగన్ (CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు వస్తారు. విమానాశ్రయంలోనే కాసేపు విశ్రాంతి తీసుకొని, ప్రధాని రాగానే ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. మరుసటిరోజు శనివారం ఉదయం 9.40 గంటలకు సీఎం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి వస్తారు.
ప్రధాని కూడా చోళ గెస్ట్‌హౌస్ నుంచి నేవీ హెలికాప్టర్‌లో బయల్దేరి 10.20 గంటలకు సభాస్థలికి వస్తారు. 11.45 గంటల వరకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది పూర్తికాగానే హెలికాప్టర్‌లో బయలుదేరి ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ సీఎం తదితరులు ఆయనకు వీడ్కోలు పలుకుతారు.మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. పీఎం, సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్న దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ 11వ తేదీ సాయంత్రం 4.20 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నోవాటెల్ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి 7 గంటలకు ఐఎన్‌ఎస్ డేగకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం నోవాటెల్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 12న 10.20 గంటలకు ఏయూకు చేరుకొని ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత గన్నవరం పయనమవుతారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు.