Tirupati, Nov 10: ఏపీలో తిరుపతిలో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ (Tirupati Students Missing) కలకలం రేపుతోంది. నెహ్రూ నగర్ లోని అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఈ ఉదయం నుంచి కనిపించకుండా పోయారు.ట్యూషన్ కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన ఐదుగురు.. తర్వాత ఇంటికి తిరిగి (girls go missing in Tirupati ) రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
కాగా విద్యార్థులు ఉదయం 6గంటల 15 నిమిషాలకు ట్యూషన్ కోసం అని స్కూల్ కి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. విద్యార్థులు ఏమయ్యారు? ఎక్కడ ఉన్నారు? అసలేం జరిగింది? అనేది ఆరా తీస్తున్నారు. కాగా, తమ పిల్లల క్షేమ సమచారం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఇదిలా ఉంటే స్కూల్ బయట ఉన్న సీసీ ఫుటేజీలో ఇద్దరు అమ్మాయిల దృశ్యాలు కనిపించాయి. మరికొన్ని సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
”ఉదయం 6గంటల 10 నిమిషాలకు స్కూల్ కి స్టడీ అవర్ కి వచ్చారు. స్టడీ అవర్స్ లో చిన్న స్లిప్ టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ రాసేసి 8 గంటల 10 నిమిషాలకు స్కూల్ నుంచి బయటకు వెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ చేసుకుని తిరిగి 9 గంటలకు స్కూల్ కి రావాలి. కానీ, ఆ ఐదుగురు విద్యార్థులు రాలేదు. దీంతో మేము వారి తల్లిదండ్రులకు కాల్ చేశాము. బ్రేక్ ఫాస్ట్ కి ఇంటికి రాలేదని చెప్పారు. పిల్లలు ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు అనే అనుమానం వచ్చేసరికి వారిని వెతికే ప్రయత్నం చేశాం. మేము చేసిన ప్రయత్నాల్లో విద్యార్థుల ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని అన్నమయ్య స్కూల్ కరస్పాండెంట్ చెప్పారు.