
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీడీనగర్‌లో 65 సంవత్సరాల వృద్ధురాలు శివరాత్రి పోచమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ కేసు వివరాలను పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. హత్య కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
సీఐ కథనం ప్రకారం, జీడీనగర్‌లో మృతురాలు పోచమ్మ నివాసం ఉంటోంది. ఆమె భర్త 20 సంవత్సరాల క్రితమే మరణించాడు. ఆమె కుమారుడు అంజి రామగుండంలో నివసిస్తున్నాడు. అయితే మృతురాలు పోచమ్మ బీసీ కాలనీలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది అదే కాలనీలో నివసించే ధర్మపురి శ్రీనివాస్ మద్యపానానికి బానిసై, పది సంవత్సరాల క్రితమే భార్య, పిల్లలు వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పోచమ్మ, శ్రీనివాస్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఇద్దరూ ప్రతిరోజూ జీడీనగర్‌లో గుడుంబా సేవిస్తూ ఉండేవారు. అయితే కొద్ది రోజులుగా పోచమ్మ తన ఇంటి సమీపంలోని పర్వతి కిష్టయ్యతో సన్నిహితంగా మెలగడం శ్రీనివాస్‌కు కోపం తెప్పించింది. దీనిపై పోచమ్మను మందలించగా, తనకు ఇష్టమైన వారితో మాట్లాడుతానని ఆమె తేల్చి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది.
ఈనెల 9వ తేదీ సాయంత్రం ఇద్దరూ కలిసి జీడీనగర్‌లో గుడుంబా తాగి తిరిగి వస్తున్న పోచమ్మతో శ్మశానవాటిక వద్ద శ్రీనివాస్ గొడవ పెట్టుకున్నాడు. ముందే సిద్ధం చేసుకున్న కర్రతో పోచమ్మ తలపై అతడు బలంగా దాడి చేశాడు. అయితే మద్యం మద్యం మత్తులో ఉన్న పోచమ్మ తీవ్రంగా గాయపడి కిందపడిపోయింది. దీంతో చనిపోయింది అనుకొని పోచమ్మ శరీరాన్ని శ్మశానవాటిక లోపలికి లాక్కెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు.
ఈనెల 14న శ్మశానవాటిక వద్ద సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధార్‌కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతదేహం పోచమ్మది అని నిర్ధారించారు. మృతురాలి కుమారుడు అంజి ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నేరం బయటపడింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు.