Vizag Vijayasri Pharma Explosion: వైజాగ్‌లో మరో పేలుడు, విజయశ్రీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, తప్పిన పెనుప్రమాదం
విశాఖలో ఈ రోజు ఉదయం మరో పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.
Visakhapatnam, August 4: ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా రాబోతున్న విశాఖపట్నంలోని పరిశ్రమల్లో పదే పదే అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఈ రోజు ఉదయం మరో పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. వరుస ప్రమాదాలు..ఏపీ సీఎం కీలక నిర్ణయం, పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు, జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ
పరిశ్రమ నుంచి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి అక్కడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండడంతో దాని ద్వారా అక్కడి సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Here's Explosion Video
పేలుడు శబ్దాలు విని కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. విశాఖ పరిశ్రమల్లో గత రెండు నెలలుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది మే నెలలో ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన నాటి నుంచి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు.
ఎల్‌జీ పాలిమర్స్ ఘటన తర్వాత సాయినార్ లైఫ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి హెచ్‌డీఎస్ గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి చెందారు. ఆ తర్వాత కొద్దిరోజులకు రాంకీ ఫార్మా సిటీలోనూ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఆ తర్వాత విశాఖ సాల్వెంట్ కంపెనీలోనూ పేలుళ్లు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. ఇక నిన్నటికి నిన్న హిందూస్తాన్ షిప్‌యార్డులో భారీ క్రేన్ కూలి 14 మంది చనిపోయారు.