
Amaravati, August 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు (Industrial Accidents) జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం (AP Govt Key Decision) తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ (Special Drive) చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 లక్షల నష్టపరిహారం, శాశ్వత ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం, క్రేన్ ప్రమాదంపై కేసు నమోదు, దర్యాప్తు
జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా మరో ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ.. సంబంధిత పరిశ్రమల్లో ఏవైనా లోపాలు ఉంటే 30 రోజుల లోపే వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశమని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. 90 రోజుల్లో ఈ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా కార్యనిర్వాహక రాజధానిగా మారనున్న విశాఖపట్నంను ఈ మధ్య వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి మొదలుపెడితే అడపాదడపా అక్కడ అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.