Antarvedi Temple Chariot Fire: రూ. 90 లక్షలతో కొత్త రథం, అంతర్వేది రధం దగ్ధం ఘటనలో ఈవో సస్పెండ్, నిజాలను నిగ్గు తేల్చేందుకు అంతర్గత విచారణ కమిటీ, టీడీపీకి మాట్లాడే హక్కు లేదని తెలిపిన మంత్రి శ్రీనివాస్
దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో రథం దగ్ధం అయిన ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు.
Amaravati, Sep 8: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన (Antarvedi Temple Chariot Fire) చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో రథం దగ్ధం అయిన ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఈ ప్రమాదం మానవ తప్పిదమా లేక కావాలని ఎవరన్నా చేశారా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు.
కాగా ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చెందిన కళ్యాణ రథం అగ్నికి ఆహుతి (Temple Chariot Catches Fire) కావడానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ఆ జిల్లాకి చెందిన మంత్రి వేణు అన్నారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రోజూ అక్కడ చెత్త వేసి తగులబెడుతుంటాడని, దానివల్ల రథానికి ముందు ఉన్న తాటాకులకు మంటలు అంటుకుని ప్రమాదం జరిగి ఉంటుందా అన్న కోణంలో పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే పెద్ద తేనపట్టు రధం మీద ఉండడంతో దాని ఈగలను చెదరగొట్టేందుకు పెట్టిన మంటలు అంటుకుని కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నామని, ఈ రెండు కోణాల్లో దర్యాప్తు సాగుతోందని మంత్రి చెప్పారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథం దగ్ధం ఘటనపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యులు ఎవరు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జిల్లా అగి్నమాపక అధికారి రత్నకుమార్, అదనపు ఎస్పీ కరణం కుమార్, అంతర్వేది ఆలయ ఈఓ చక్రధరరావులతో ఈ కమిటీ ఏర్పాటైంది. నాలుగైదు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు
హిందువుల దేవాలయాల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. పుష్కరాల వంకతో 40 గుళ్లు కూల్చేసిన చంద్రబాబు... గోదావరి పుష్కరాల్లో 23మందిని పొట్టనపెట్టుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు.. పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా ప్రతి దేవాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయనే అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి వెలంపల్లి అన్నారు. శాసనమండలిలో నారా లోకేష్‌కు సవాల్ విసిరితే పారిపోయారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడమా అని ఎద్దేవా చేశారు. రథం దగ్ధం ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశామని అలాగే ఈవోని బదిలీ (Sri Lakshmi Narasimha Swamy temple EO Transferred) చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్వేదిలో సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నమని మంత్రి విజ్ఞప్తి చేశారు.