AP Budget Sessions 2022: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదు, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఏపీ సీఎం జగన్, 2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి
చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్ శంకుస్థాపన, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాపర్ డ్యామ్ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని గుర్తు చేశారు
Amaravati, Mar 22: ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. అసెంబ్లీ (AP assembly Budget Sessions) రేపటికి(బుధవారానికి) వాయిదా పడింది. మంగళవారం సభలో పోలవరంపై ( Polavaram Project) స్వల్ఫకాలిక చర్చ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్.. ప్రాజెక్టుకు సంబంధించిన పనుల గురించి (CM YS Jagan Speech on Polavaram Project) వివరిస్తూనే, ప్రతిపక్ష నేత చేస్తున్న తప్పుడు ప్రచారాలను సూటిగా ప్రశ్నించారు. పోలవరం ఎత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాద్ధాంతంపై శాసన సభ సమావేశాల్లో ఎండగట్టారు.
చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్ శంకుస్థాపన, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాపర్ డ్యామ్ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని గుర్తు చేశారు సీఎం జగన్. గేట్లకు సంబంధించిన.. స్పిల్‌వేలో గ్యాలరీ వాక్ అంటూ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీటూర్ చేశారని, తద్వారా పొలవరం పనులు పూర్తయ్యాయనే భ్రమను జనాల్లో కలిగించే ప్రయత్నం చేశారన్నారు సీఎం జగన్.
ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో.. రూ.100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను పొలవరం తరలించారని, ‘జయము జయము చంద్రన్న’ పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో జయము జయము చంద్రన్న పాట ప్లే కాగా.. సభ మొత్తం నవ్వులు పూశాయి. కమీషన్ల కోసం కక్కుర్తి పడే ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన గొంతు నొక్కారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు.
సీఎం జగన్.. తమ పాలనలో పొలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు.. పూర్తి వివరాలను సభకు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ బాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని, మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలి పెట్టారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతో పాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగిందని తెలిపారు.
దిగువ కాపర్‌డ్యామ్‌కు కూడా భారీ నష్టం వాటిల్లిందని, పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడిందని తెలిపారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం జగన్ అన్నారు. వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే అప్పట్లో అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు కాదు.. చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని అన్నారు. ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్ తెలిపారు.
2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేంద్రం సమకారంతో ఆర్‌అండ్‌ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ : చంద్రబాబు మూడేళ్లు కాలయాపన చేయకుండా ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది. చంద్రబాబు భజన కోసం వంద కోట్లు ఖర్చు చేశారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేశాం. ఎల్లో మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు. బాబు హయాంతో ప్లానింగ్ లేకుండా అడ్డదిడ్డంగా పనులు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు లేకుండా ముందుకెళ్తోంది అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.పోలవరం ప్రాజెక్ట్ 48 గేట్లను మా హయాంలోనే అమర్చాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్ట్ పనులను ఆపలేదు. పోలవరాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. మహానేత తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేస్తారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
తెల్లం బాలరాజు ; పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటిదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే టీడీపీ గోదార్లో కలిసిపోతుంది. చంద్రబాబు పావలా చేసి.. రూపాయి పావలా పబ్లిసిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వాసితులను చంద్రబాబు ఏనాడు కలవలేదు. సీఎం వైఎస్ జగన్ వచ్చిన ప్రతీసారి నిర్వాసితులతో మాట్లాడారని తెల్లం బాలరాజు అన్నారు.
'ఏపీ ప్రజల దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టు. ఇది పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 23.5లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతంది' అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.