AP Capital Amaravathi Update: అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు, ఎంత ఖర్చవుతుంది? ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తారంటే?
డిసెంబర్ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు.
Vijayawada, AUG 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi Construction) నిర్మాణంపై ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధ్యమైనంత తొందరగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో ఐఐటీ నిపుణుల కమిటీ నివేదిక అందుతుందని నారాయణ (Minister Narayana) చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు. పాత టెండర్లను క్లోజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం అంచనాలు పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో 41వేల కోట్లకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఇప్పుడు 60వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. సాధ్యమైనంత తొందరగా రాజధాని పనులు పూర్తిచేస్తామని స్పష్టత ఇచ్చారు.
నాలుగేళ్లలోనే రాజధాని (AP Capital) నిర్మాణానికి పూర్తి చేస్తామని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని వెల్లడించారు. అభివృద్ధిని ఒక్కచోటే పరిమితం చేయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానితో పాటు 26 జిల్లాలను కూడా అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అధికారం చేపట్టిన వెంటనే అమరావతిలో పర్యటించిన ఆయన.. రాజధాని నిర్మాణం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా చేపట్టారు.